తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు వరుసగా రెండురోజులపాటు దాడులు నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారస్తులే టార్గెట్ గా ఈ సోదాలు జరిగాయి. ఈ బిజినెస్ లో లొసగులను ఆధారం చేసుకొని కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. గ్రానైట్ ను ఎక్కువ ఎగుమతి చేస్తూ.. తక్కువ చూపించి పన్నులు ఎగ్గొట్టి బాగానే వెనకేసుకున్నారు. ఇదే ఈడీ , ఐటీ ఎంటర్ అయ్యేందుకు ఆస్కారం కల్పించాయి. రెండు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేసిన అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
వాస్తవానికి గ్రానైట్ వ్యాపారులందరూ ఎక్కువ ఎగుమతి చేసి తక్కువ చూపించి అక్రమాలకు పాల్పడుతారనేది ఓపెన్ సీక్రెట్. అందుకే గ్రానైట్ వ్యాపార సామ్రాజ్యంలో వెలుగొందిన వారంతా రాష్ట్రంలోని అధికార పార్టీతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలకు నిధులు సమకూర్చుతుంటారు. ఇటీవలి రాజకీయాలు పూర్తిగా మారడంతో ఈడీ దాడులు ప్రారంభించింది. టీఆర్ఎస్ తో సంబంధం ఉన్న గ్రానైట్ కంపెనీలను టార్గెట్ చేసింది. మొదటి రోజు మంత్రి గంగుల కమలాకర్ నివాసం , కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆ మరుసటి రోజు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో దాడులు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఐటీ , ఈడీ దాడులు ఒకరిద్దరూ నేతలతోనే ఆగిపోవని, మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా కొనసాగుతాయని అంటున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గంగుల , రవిచంద్రను ప్రగతి భవన్ కు పిలిపించుకొని ఈడీ, ఐటీ దాడులపై వారితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఇంకా మరెవరిపైన దాడులు జరగనున్నాయనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది.