ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఇటీవల అసంతృప్తి వ్యాఖ్యలు చేసినా హైకమాండ్ పిలిచి మాట్లాడకపోవడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు..? ఎప్పుడు కండువా కప్పేదామా అనే ఆతృతతోనున్న కమలనాథులు ఈ ఇద్దరు నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు చెబుతున్నారు.
ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో తుమ్మల , పొంగులేటిలు పార్టీ మారే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి ఎలాగైనా పోటీ చేసి తీరాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామన్న అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని ఇటీవల ఆయన ధిక్కార వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను.. తన అనుచరులు పోటీ చస్తారని స్పష్టం చేశారు. పొంగులేటినే గతంలో పక్కనపెట్టిన కేసీఆర్ ఈసారి ఆయనకూ ఛాన్స్ ఇచ్చి, అనుచరులకు కూడా అవకాశం ఇస్తారా..? అంటే ఖచ్చితంగా ఇవ్వరనే సమాధానం వస్తోంది. ఈ లెక్కన పొంగులేటి పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీజేపీ చాలా వీక్ గా ఉంది. ఈ జల్లాలో పట్టు సాధించాలని చాలా ప్రయత్నాలే చేసింది. ఇందుకోసం గతంలోనే తుమ్మల, పొంగులేటిలను బీజేపీ నేతలు సంప్రదించారు కాని అప్పట్లో నో చెప్పేశారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మరోసారి తాజాగా పొంగులేటికి బీజేపీ టచ్ లోకి వెళ్లిందని..పార్టీ మారేందుకు ఆయన ఒకే చెప్పినట్లు చెబుతున్నారు. ఇక, తుమ్మల కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
బీఆర్ఎస్ తరుఫున పాలేరు టికెట్ ఆశిస్తున్నారు తుమ్మల. కాని ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువే. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. తుమ్మలకు చెక్ పెట్టేందుకుగాను పలుమార్లు తాను వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో తుమ్మల వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో కేసీఆర్ , తుమ్మల నాగేశ్వర్ ల మధ్య సాన్నిహిత్యం ఉండేది. రాజకీయంలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. తుమ్మలకు కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొంగులేటి బీజేపీ వైపు చూస్తుండగా.. తుమ్మల మాత్రం కాంగ్రెస్ అయితేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. కాని బీజేపీ మాత్రం ఇద్దర్ని లాగేసుకోవాలని ప్రయత్నిస్తోంది.