తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ టర్మ్ పూర్తయింది. ఆయనకు మరోసారి అవకాశం ఉంటుందా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎన్నికల వరకు ఆయనే కమలం సారధిగా ఉంటారని…హైకమాండ్ కూడా బండి నాయకత్వంపై భరోసా ఉంచిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు బండి సంజయ్ సారధ్యంలో వెళ్తామని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇటీవల ప్రకటించారు. కానీ ఢిల్లీ పెద్దలు ఎవరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
బండి సంజయ్ పై బీజేపీ అగ్రనాయకత్వం సానుకూలంగా ఉన్నా…రాష్ట్రంలోని మెజార్టీ పార్టీ నేతలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. బండి సంజయ్ ఒంటరి పోకడలు…ఆధిపత్య రాజకీయాలు సీనియర్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పలుమార్లు ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సీనియర్ నేతలు ఓ వర్గంగా ఏర్పడ్డారు.
తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఓ వర్గం… ఆయన వ్యతిరేకులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఇటీవల రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా బండికి హితబోధ చేశారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలని బండి సంజయ్ కు సూచనలు చేసినా ఆయన వైఖరి మాత్రం మారలేదు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ లాంటి నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్లు సంజయ్ విషయంలో వ్యతిరేకతతో ఉన్నారు.
ఇటీవల కవితపై బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి చేటు తెచ్చాయి. ఆయన దూకుడు పార్టీకి ఊపు తీసుకొస్తుందని అనుకుంటున్నా.. అంతే మొత్తంలో నష్టం కూడా జరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను అద్యక్ష బాధ్యతలు చేపట్టాకే బీజేపీ తెలంగాణలో బలపడింది అనేఅహం బండిలో ఎక్కువైందని అందుకే సీనియర్ నేతలను ఖాతరు చేయడం లేదని అసంతృప్తిగా ఉన్నారు.
అందుకే… బండి సంజయ్ కు మరోసారి అద్యక్ష బాధ్యతలు దక్కుండా కిషన్ రెడ్డి నేతృత్వంలో ఓ వర్గం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతోన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి అహం తగ్గాలంటే ఆయనను అద్యక్ష బాధ్యతల నుంచి దించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… హైకమాండ్ మాత్రం బండిపైనే సానుకూలంగా ఉందని..ఆయనకే మరోసారి అవకాశం ఇవోచ్చుననే తెలుస్తోంది.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వెనక బండి సంజయ్ హస్తం..?