కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనే చర్చ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా…ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తారా..? అనేది అనుమానమే.
ఏదైనా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే/ఎంపీ రాజీనామా చేసినా, మృతి చెందినా ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఈ బైపోల్ ను ఆరు నెలల్లోగా జరపాలనేది రాజ్యాంగ నిబంధన. అయితే, మరో ఎనిమిది నెలలో సాధారణ ఎన్నికలు ఉండగా…తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తారా అనేది కేంద్ర ఎన్నికల సంఘం విచక్షణపై ఆధారపడి ఉంది. అంటే బంతి కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో ఉందని అర్థం అవుతోంది.
రాజ్యాంగ నియామావళి ప్రకారం…ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నికను ఆరు నెలల్లోగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను వచ్చే నెలలో విడుదల చేసినా…ఉప ఎన్నిక పూర్తయ్యే నాటికి మరో మూడు నెలల సమయం పక్కాగా పడుతుంది. అంటే కంటోన్మెంట్ కు జూన్, జూలై లో కొత్త ఎమ్మెల్యే ఎన్నిక అవుతారు. ఆ తరువాత సాధారణ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయమే ఉండగా..కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పదవిలో కొనసాగేది కేవలం నాలుగైదు నెలలే. కాబట్టి…కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహిస్తారా …? అనే అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకే మొగ్గు చూపితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు మే లో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు…సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారు. ఈ సభ ముగిసిన పది రోజుల వ్యవధిలో అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఉప ఎన్నిక లేనట్టే…
చూడాలి మరి ఏం జరుగుతుందో..