పాదయాత్ర అనుమతుల విషయంలో ఏపీ సర్కార్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడిచే అవకాశం కనిపిస్తోంది. యువగళం పేరిట ఈ నెల 27 నుంచి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం అనుమతులు కోరగా ఏపీ సర్కార్ ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో లోకేష్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది.
అదే సమయంలో తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి “యాత్ర” పేరిట పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 26న ప్రారంభమై జూన్ 2న ముగించనున్నారు. అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. కొన్నాళ్ళుగా రేవంత్ పాదయాత్ర విషయంలో కనిపించిన చిక్కుముళ్ళు తాజాగా తొలగిపోవడంతో నూతనోత్తజంతో పాదయాత్రకు రెడీ అయ్యారు.
రేవంత్ పాదయాత్ర చేసేందుకు సిద్దం అయ్యారు కాని, సర్కార్ నుంచి అనుమతులు వస్తాయా..? అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే.. ఏపీతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అటు ఏపీలో టీడీపీ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో లోకేష్ , తెలంగాణలో రేవంత్ రెడ్డిలు పాదయాత్రలు చేసి తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. వీరు పాదయాత్రలు చేపడితే వీరికి జనాలు బ్రహ్మరథం పడుతారని.. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతామని అధికార పార్టీలు ఆందోళన చెందుతాయి.
ఎందుకంటే.. గతంలో పాదయాత్రలు చేసిన నేతలు వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అటు జగన్ సర్కార్… లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేందుకు ఆలోచిస్తుండగా.. రేవంత్ పాదయాత్ర విషయంలోనూ తెలంగాణ సర్కార్ ఆందోళనగానే ఉంది.