వన్డే వరల్డ్ కప్ కు ఆటగాళ్ళ ఎంపికపై బీసీసీఐ దృష్టి పెట్టింది. 2011లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత టీమిండియాకు మరోసారి కప్ ను అందుకునే అదృష్టం దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ లక్ష్యంగా ఆటగాళ్ళను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది.
వరల్డ్ కప్ కు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో యువఆటగాళ్ళకు ఛాన్సులు ఇస్తూ పరిక్షిస్తోంది బీసీసీఐ. అత్యుత్తమంగా రాణించే వారికీ జట్టులో స్థానం కల్పించడం కోసం ప్రయోగాలు చేస్తోంది. ఇందులో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తుండగా.. జూనియర్లకు కూడా వరుస అవకాశాలు ఇస్తు పరిక్షిస్తోంది.
టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సూర్య కుమార్ కు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం ఇస్తారా..?ఇవ్వరా అనే చర్చ అప్పుడే జరుగుతోంది. ఎందుకంటే.. లంకతో జరిగిన టీ20లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శతకం బాదిన సూర్యకు ప్రస్తుతం జరుగుతోన్న వన్డే సీరిస్ లో మాత్రం తుది జట్టులో ఆడే అవకాశంరాలేదు. దీంతో వన్డే వరల్డ్ కప్ కు సూర్యను ఎంపిక చేసినా తుదిజట్టులో ఉండేది అనుమానమే.
కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అతడి ఎంపికపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. జట్టులో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు. దీంతో అతని వైపే జట్టు ఎక్కువగా నమ్మకం చూపుతోంది. క్లిష్ట సమయంలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పే శ్రేయస్ నే తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది.