టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ చేస్తోన్న సీనియర్లు పార్టీ మారేందుకు దారి వెతుక్కుంటున్నట్లు అర్థం అవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించి పార్టీ మారుతారా అనే విమర్శలకు రేవంత్ ను బూచిగా చూపి గోడ దూకేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగమే సీనియర్ల పార్టీ ధిక్కార ప్రకటనలు. పార్టీ అంటే ప్రాణమని చెబుతూనే ఎన్నికల్లోపు కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయాలనేది సీనియర్ల ప్లాన్. ఆ తరువాతే కాంగ్రెస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నూతన కమిటీలో నియామకమైన వారు 50శాతానికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వాస్తవానికి టీపీసీసీ జంబో కమిటీలో పదవులు పొందిన 196మందిలో జస్ట్ 12మంది మాత్రమే వలస నేతలు. మిగిలిన వారంతా మొదటి నుంచి కాంగ్రెస్ లోనున్న వారే. పైగా ఆ 12 మంది కూడా పార్టీ పటిష్టత కోసం రెండేళ్ళుగా పని చేస్తోన్న వారే. దీనిని సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ చీఫ్ పై దుమ్మెత్తిపోస్తున్నారంటే సీనియర్ల రాజకీయ లక్ష్యమెంటో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై తాజాగా ప్రేమ పొంగుకొచ్చింది. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో టీఆర్ఎస్ కోవర్ట్ గా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆయన హయంలో కాంగ్రెస్ ఒక్క ఎన్నిక గెలిచింది లేదు. పార్టీ వీడాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. వరుస ఓటముల తరువాత పీసీసీ చీఫ్ గా తప్పుకుంటే రేవంత్ కు పదవి అప్పగించింది అధిష్టానం.
పూర్తిగా పార్టీ బలహీనపడుతున్న దశలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్…పార్టీని తిరిగి రేసులోకి తీసుకొచ్చారు. బీజేపీ – టీఆర్ఎస్ ల మధ్యే రాజకీయం నానుతున్న దశలో కాంగ్రెస్ ను పోటీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు సీనియర్ల రాజకీయం దాన్ని మళ్లీ మునుపటి స్థితికి తెచ్చేసింది. ఇదంతా పార్టీ మరెందుకు సీనియర్లు చేస్తోన్న రాజకీయమేనని అర్థం అవుతోంది.