ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ లో అయిష్టంగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలకు టికెట్ ఇస్తామని కాని, ఇవ్వమని కాని కేసీఆర్ నుంచి హామీ లభించలేదు. దీంతో ఈ ఇద్దరు కేసీఆర్ ను టెస్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తే కేసీఆరే పిలిచి మాట్లాడుతారని అనుకోని ఈ ధిక్కార స్వరాలు వినిపిస్తు ఉండొచ్చు. అయినా కొన్నాళ్ళుగా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ హైకమాండ్ వీరిని పిలిచి మాట్లాడిందిలేదు. దీంతో తమను పార్టీని పరిగణనలోకి తీసుకోకుంటే.. మేము కూడా పార్టీని పట్టించుకోమని తాజాగా ఈ ఇద్దరు నేతలు పరోక్షంగా ప్రకటించారు. వీరిని పిలిచి మాట్లాడకపోగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెక్యురిటిని కుదించి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఈ పరిణామంతో పొంగులేటి అడుగులు ఎటుపడుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. కానీ కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్లు అంటున్నారు. దీంతో తుమ్మలకు టికెట్ దక్కే అవకాశం లేదన్నది స్పష్టం అవుతోంది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల మాత్రం పాలేరు ఈసారి నాదేనని అంటున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పడం లేదు కాని పోటీ మాత్రం పక్కా అంటూ క్యాడర్ కు సందేశం ఇస్తున్నారు. తుమ్మలను కాదని కందాలకు కేసీఆర్ టికెట్ ఇస్తే తుమ్మల బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తారా..? కాంగ్రెస్ , బీజేపీలో చేరి టికెట్ దక్కించుకుంటారా..?అన్నది ఖమ్మం పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Also Read : పొంగులేటికి కేసీఆర్ షాక్ – రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా..?
తుమ్మలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆ మధ్య చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తుమ్మలను బీజేపీలో చేర్చుకోవడం వలన అసలే పట్టు లేని ఖమ్మం జిల్లాలో కొంత పట్టు సాధించవచ్చునని కమలనాథులు భావించారు. కాని, కమ్యూనిస్ట్ ల ప్రభావం అధికంగా ఉండే ఖమ్మంలో కాషాయపార్టీకి ఆదరణ ఉండదని బీజేపీలో చేరికపై తుమ్మల వెనక్కి తగ్గారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, బీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే ఆయన మరో ఆప్షన్ కాంగ్రెస్సేనని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన క్యాడర్ మాత్రం పార్టీ జెండాలను మోస్తూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అయితేనే బెటర్ అనే అభిప్రాయంతో తుమ్మల ఉన్నట్లు చెబుతున్నారు.
ఇకపోతే, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధిక్కార స్వరం వినిపించిన మూడు రోజుల వ్యవధిలోనే ఆయన భద్రత సిబ్బందిని కుదిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది పొంగులేటికి ఆగ్రహం తెప్పించిందట. కేసీఆర్ తమను పిలిచి మాట్లాడుతారనుకుంటే సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించి అవమానించినట్లు ఉందని పొంగులేటి ఫీల్ అవుతున్నారట. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో తాడోపేడో తేల్చుకోవాలని ఇందుకోసం త్వరలోనే మరోసారి కార్యకర్తలతో భేటీ కావాలనే తలంపుతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారట. కార్యకర్తల భేటీ అనంతరం వారి మనోభీష్టం మేరకు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.