బీజేపీలో ఆశించిన ప్రాధాన్యత దక్కకపోవడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..? పార్టీ నాయకత్వం తన సేవలను ఏమాత్రం వినియోగించుకోవడం లేదని అవమానంగా ఫీల్ అవుతోన్న కొండా ఇది తనకు అవమానకరమని భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ వైఖరి నచ్చక ముందస్తు ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఉత్తమ్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని.. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమించడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ తరువాత కమలం పార్టీలోకి జంప్ చేశారు.
బీజేపీలో చేరిన తరువాత కొన్నాళ్ళు యాక్టివ్ గా పని చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆ తరువాత బండి సంజయ్ పట్టించుకోవడం లేదని సైలెంట్ అయ్యారు. దాంతో బండి సంజయ్ పై కొండా గుర్రుగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. చేవెళ్ళలో ప్రత్యామ్నాయ నేతగా మరొకరిని ప్రోత్సహిస్తున్నారని కొండా అనుమానిస్తున్నారు.
అదే సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా ప్రత్యర్ధి పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ హైకమాండ్ వేధిస్తోందని పార్టీ విధానాలను కొండా ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ తన రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతుందని ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసేందుకు మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ వీడియోలో అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఉదాహరణగా చూపుతూ ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కటకటాల వెనక్కి నెట్టాల్సిన రాజకీయ అవసరం ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పటికే చేసి ఉండేదని అన్నారు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అది బిజెపికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆమెను అరెస్టు చేయడం లేదని కొండా ఆ వీడియోలో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఏ ఉద్దేశ్యంతో చేశారో కానీ బీజేపీపై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే కొండా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే త్వరలోనే పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. చూడలి మరి ఏం జరుగుతుందో..
Also Read : ప్రధానితో కోమటిరెడ్డి భేటీ – బీజేపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయిందా..?