కేంద్రం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పిలుపు వచ్చింది. ఆయన వెళతారో లేదో ఇంకా స్పష్టత లేదు. కొంతకాలంగా ప్రధానిని నేరుగా కలిసేందుకు కేసీఆర్ అస్సలు ఇష్టపడటం లేదు. మోడీ తెలంగాణ పర్యటనకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆహ్వానం పలకాల్సి ఉన్నా కేసీఆర్ అవేవి పట్టించుకోకుండా మంత్రులను పంపిస్తున్నారు.
అయితే, జీ20 దేశాల కూటమికి భారత్ సారధ్యం వహిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చే నెల 5న కేంద్రం సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రావాలంటూ కేసీఆర్ కు కబురు పంపారు. కేంద్రంతో కోరి కయ్యం పెట్టుకున్న కేసీఆర్ ఈ సమావేశానికి దూరంగానే ఉండొచ్చు. అయితే, ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు.
కేసీఆర్ వచ్చే నెలలో ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ గా అనుమతులు డిసెంబర్ మొదటి వారంలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల ఇంచార్జ్ లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎవరెవరిని రాష్ట్ర అద్యక్షుడిగా ప్రకటించాలో కేసీఆర్ కు స్పష్టత వచ్చింది. రాష్ట్ర అద్యక్షులుగా రైతు సంఘాల నాయకులకు అవకాశం కల్పించి…దేశవ్యాప్తంగానున్న రైతుల దృష్టిని తనవైపు తిప్పుకోనున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించి జాతీయ స్థాయిలో జెండా, ఎజెండా ఢిల్లీ వేదికగా ఆయన కార్యాచరణ ప్రకటించనున్నారు.
బీఆర్ఎస్ కు అన్ని అనుమతులు వచ్చిన వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి బీఆర్ఎస్ పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకోసం ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. దాంట్లో భాగంగా పనిలో పనిగా కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి కేసీఆర్ హాజరు అవుతారేమో చూడాలి.