ఏపీలోనూ బలపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నేతలతో పొసగకనే ఆయన బీజేపీని వీడారు. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ మరింత బలహీన పడుతుందని…వైసీపీ అనుబంధ సంస్థగా ఏపీ బీజేపీ మారడంతోనే పార్టీకి కన్నా లక్ష్మినారాయణ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన దారెటు..? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో చేరే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీని వీడారనే అంటున్నా..మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిపెట్టిన కేసీఆర్ కాపు సామజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోన్న నేపథ్యంలో.. కన్నాకు బీఆర్ఎస్ ఆహ్వానం అందిందని ఆయన కారెక్కుతారని చర్చ జరుగుతోంది. దీంతో ఆయన పొలిటికల్ జర్నీపై అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది.
టీడీపీ నుంచి నుంచి గుంటూరు అసెంబ్లీ సీట్ కన్నాకు ఆఫర్ చేశారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కన్నాతో జనసేన నేతలు కూడా సంప్రదింపులు జరిపారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే అక్కడ సీట్ కేటాయిస్తామని కన్నాకు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఇలా ఆయన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా.. తెరపైకి బీఆర్ఎస్ కి వచ్చింది. కాపు సామజిక వర్గానికి ఏపీ బీఆర్ఎస్ లో పెద్దపీట వేస్తున్న కేసీఆర్.. కన్నాతో టచ్ లోకి వెళ్ళారని అంటున్నారు.
ఇప్పటికే కాపు సామజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్ఎస్ అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో కన్నా చూపు బీఆర్ఎస్ పై పడిందని.. పార్టీలో చేరితే కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. తనతోపాటు తన అనుచరులకు కూడా ప్రాధాన్యత దక్కాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన అనుచరులకు కూడా సీట్లు దక్కాలంటే బీఆర్ఎస్ బెటర్ అని కన్నా భావిస్తున్నారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ ను ఆగమాగం చేసుకున్నారు కన్నా. బీఆర్ఎస్ లో చేరితే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందేమో కానీ రాజకీయంగా పెద్దగా ఒరిగేదేం ఉండే అవకాశం లేదు.