బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ పరిణామాలపై గత కొంతకాలంగా హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారని దాంతో ఆయన కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్ళారని బుధవారం నుంచి ప్రచారం సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత తన వర్గం ఎమ్మెల్యేలతో హరీష్ కాంగ్రెస్ గూటికి చేరుతారనేది ఆ ప్రచార సారాంశం.
హరీష్ రావుపై ఈ రకమైన ప్రచారం ఎవరు చేయిస్తున్నారు..? ఇది ప్రచారమేనా..? వాస్తవం ఏమైనా ఉందా..? అనే చర్చలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ తోపాటు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు రేపెందుకు ఈ రకమైన ప్రచారం చేయిస్తున్నారా..? లేక వ్యూహాత్మకంగా హరీష్ రావును పార్టీలోకి లాగేసుకోవాలని ప్రత్యర్ధి పార్టీ ఈ రకమైన ప్రచారం చేయిస్తోందా..? అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే, పార్టీలో ఉన్న కొంతమంది నేతలే ఈ తరహ ప్రచారం వెనకుండి నడిపిస్తున్నారా..? అనే అనుమానాలను బీఆర్ఎస్ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.
మైనంపల్లి ఘాటు వ్యాఖ్యల తరువాత హరీష్ రావుపై మాటల దాడి తగ్గుతుందనుకుంటే మరింత పెరిగింది. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా కోరలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం అనేక అనుమానాలకు తావిస్తోంది. హరీష్ రావుకు పొమ్మనలేక పొగబెట్టేందుకు ఈరకమైన ప్రచారం చేయిస్తున్నారా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ – హైకోర్టు సంచలన తీర్పు