తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పార్టీని సంస్కరించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అద్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి.. ఆయన స్థానంలో ఈటలకు బాధ్యతలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి తరువాత కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. తెలంగాణ నుంచి మరొకరిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడీ అండ్ షా లు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, బండి సంజయ్ ఎంపీలుగా ఉండగా.. వీరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు.
బండి సంజయ్ రాష్ట్ర అద్యక్ష పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కేంద్రమంత్రివర్గంలో తీసుకుంటే ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుందని అగ్రనాయకత్వం భావిస్తోంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ల పేర్లు మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో సీనియర్ నేత లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల యూపీ నుంచి ఎంపీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల కమిటీలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. పార్టీ బాధ్యతల్లో ఉన్నందున ఆయనను కేంద్రమంత్రిని చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీని బలమైన పార్టీగా మార్చారు బండి సంజయ్. దాంతో పార్టీలో ఆయన వర్గం ఏర్పాటైంది. ఈటల బీజేపీలో జాయిన్ అయ్యాక బండి వ్యతిరేకులంతా కలిసి ఈటల వర్గం కూడా జతయ్యారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని హైకమాండ్ వద్ద బండి సంజయ్ పై ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఆయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు ప్రత్యర్థిగా ఈటల రాజేందర్ అయితేనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లుగా చెబుతున్నారు.