ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే తెలుసు కదా! ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాల పని అలాగే ఉంది. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుంటే ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. పదేళ్లు అధికారం వెలగబెట్టిన వారికి చట్టం ఎలా పనిచేస్తుంది. ఒక కేసు నమోదైతే ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయన్నది తెలియక కాదు. కానీ రేపో…ఎల్లుండో తమకు కూడా ఇలాంటి గతే పడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఇంతకీ ఇదంతా దేని గురించో అర్ధమైంది కదా! అల్లు అర్జున్ అరెస్ట్ గురించే. సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా మహిళ మృతిపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నారు. ఇప్పటికే థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఇంచార్జ్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా చట్టప్రకారం జరుగుతున్న చర్య. నిజానికి తన అరెస్ట్ విషయం అల్లు అర్జున్ కు కూడా ముందే తెలుసు…అందుకే హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దానిపై విచారణ వాయిదా పడింది. దీంతో రూల్స్ ప్రకారం నాలుగు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. వాటికి కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. దీంతో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా అన్ని నిబంధనలు పాటించారు.
ఈ విషయంలో పోలీసుల తీరును ఎవరూ అనుమానించడం లేదు. పైగా సెలబ్రిటీలు అయినా, సామాన్యులైనా పోలీసులు ఒకేతీరుగా వ్యవహరించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలకు భయం పట్టుకుంది. ఇప్పటికే అనేక కేసుల్లో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల పేర్లున్నాయి. ముఖ్యంగా ఎఫ్-1 ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ నేడో రేపో అరెస్ట్ చేయడం పక్కా అని తెలుస్తోంది. దీంతో కేటీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకుంది. అరెస్ట్ అనే మాట వినపడితే ఎక్కడా లేని చిరాకు వస్తోంది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ సంగతి తెలియగానే క్షణాల్లో రియాక్ట్ అయ్యాడు.
అయితే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగిన రేవతి అనే సామాన్య గృహిణి చనిపోతే కనీసం స్పందించలేదు. ఆమె కుటుంబానికి సంతాపం కూడా చెప్పలేదు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాల్సింది పోయి..ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించడమే మా పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన, బాధితులకు అండగా నిలిస్తే దాన్ని కూడా తప్పుబడుతున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్్ అయితే మినహాయింపులేమీ ఉండవని, చట్టం ముందు అంతా సమానులే అని అందరికీ తెలుసు. ఈ చిన్న లాజిక్ కేటీఆర్ అండ్ కో కు తెలియక కాదు. కానీ వీకెండ్ పార్టీల్లో తనతో చీర్స్ కొట్టే సినిమా వాళ్ల జోలికి వచ్చేసరికి కేటీఆర్ అంతగా హర్టయిపోతున్నారు. గతంలో నాగార్జున విషయంలో కూడా క్షణాల మీద స్పందించారు.
అధికారంలో ఉన్నప్పుడు తమ నిర్లక్ష్యంతో ఎన్ని ప్రాణాలు పోయినా స్పందించని కేటీఆర్…ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా సామాన్యుల పట్ల అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా తనకు సినీ స్నేహితులు, బడాబాబుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజానికం ట్విట్టర్ టిల్లు వ్యవహారశైలిని చీదరించుకుంటున్నారు.