గుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లగానే అప్రయత్నంగానే వంగి ద్వారానికి నమస్కారం చేస్తారు. దాదాపు 90శాతం భక్తులు ఇలా చేస్తుంటారు. ఎందుకిలా చేస్తారు, ఆ గడపకి నమస్కరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా?.గుడిలో అడుగుపెట్టే ముందు గడపకి ఎందుకు నమస్కారం చేస్తారు?
భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. భగవంతుడికి-మానవుడికి మధ్య అనుసంధానం ఈ దేవాలయాలు. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆలయాలు ఘనమైన పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాడు అందించాయి. హిందువులు భగవంతుడిని చేరుకునేందుకు ఎన్నో మార్గాలు అవలంభిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు… పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల,మత, వర్ణ, లింగ బేధాలకు అతీతంగా అందర్నీ ఒకే రీతీలో అక్కున చేర్చుకుందని చెప్పొచ్చు. అందుకే దైవ భక్తి ఉన్నవారంతా స్వామి, అమ్మవార్ల అనుగ్రహం కోసం దేవాలయాలు సందర్శిస్తుంటారు.
గుడికి వెళ్లేవారంతా బయట కాళ్లు కడుక్కుని, లోపల అడుగుపెట్టే సమయంలో ఆలయ ప్రవేశం ద్వారం గడపకి నమస్కారం చేస్తారు. ఒకరి తర్వాత మరొకరు వంగి నమస్కరిస్తూ ఆ గడపని దాటి వెళుతుంటారు. ఎందుకిలా అని అడిగితే మా పెద్దలు పాటించారు మేం కూడా ఫాలో అవుతున్నాం అంటారు. అయితే అసలు విషయం అదికాదు. సాధారణంగా ఇళ్లకు ద్వారాలన్నీ చెక్కతో చేసినవి ఉంటాయి. ఆలయాలకు మాత్రం రాతితో తయారు చేసినవి ఉంటాయి. ఎందుకిలా…ఇళ్ల ద్వారాల్లానే ఆలయాలకు కూడా చెక్కతో పెట్టొచ్చు కదా, రాయితో ఎందుకు పెడతారు, లోపలకు అడుగుపెట్టేముందు ఆ గడపకి ఎందుకు నమస్కరిస్తారనేందుకు ఓ కథనం చెబుతారు.
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు ప్రవేశ ద్వారంగా అమరుస్తారు. ఆ కొండ నుంచి తీసుకొచ్చిన రాయి నిత్యం భగవన్నామస్మరణలో ఉంటుందట. అందుకే ఆ రాయి తొక్కుతూ లోపలకు అడుగుపెట్టకూడదని..దాన్ని దాటుకుంటూ వెళ్లే క్రమంలో ముందుగా క్షమించమని అడుగుతూ చేసే నమస్కారం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన ఆలయాల్లో ద్వారంపై అడుగేయకుండా..దాటాలాని పండితులు చెబుతారు.