టీమిండియా యువ క్రికెటర్ పృధ్వీ షా పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. కారులో వెళ్తుంటే కూడా వదలకుండా దాడికి యత్నించి కొంతమంది తమ ఆగ్రహాన్ని చల్లబర్చుకున్నారు. సెల్ఫీలు అడిగితే తమను పట్టించుకోకుండా కేవలం ఇద్దరికి మాత్రమే సెల్ఫీలు ఇస్తాడా..? అనే ఆగ్రహంతో పృద్వీ షాపై రెచ్చిపొయారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. బుధవారం పృధ్వీ షా తన స్నేహితులతో కలిసి ముంబైలోని శాంతా క్రూజ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాడు. అక్కడే షా ను చూసిన కొంతమంది సార్.. సెల్ఫీ అంటూ దూసుకొచ్చారు. అందరికీ సెల్ఫీలు ఇవ్వడం కుదరదని.. ఓ ఇద్దరికే మాత్రమే సెల్ఫీలు ఇచ్చేసి హోటల్ లోపలికి వెళ్ళడంతో మిగతా వారు నొచ్చుకున్నారు. ఇది తమను కించపర్చడమేనని అతిగా ఊహించుకున్నారు. ఇంకేముంది.. తమను పట్టించుకోని షా పై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
హోటల్ నుంచి తిరిగి వెళ్తుండగా పృథ్వీ పై దాడికి పాల్పడ్డారు. కారు వెళ్లిపోతుంటే కూడా వెంటపడి మరీ కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దాడి ఘటనపై షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సప్న గిల్ అనే యువతీ షా పై దాడికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
షా స్నేహితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సప్న గిల్ తోపాటు దాడికి పాల్పడిన వారిని సీసీ కెమరాల సహాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న సప్న గిల్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కావడం గమనార్హం.ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈమెకు 2 లక్షల 20 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చంఢీఘడ్ కు చెందిన సప్న ప్రస్తుతం ముంబయిలో ఉంటుంది. కేవలం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానే కాకుండా.. రవి కిషన్ నిరాహువా వంటి స్టార్ నటులతో కూడా నటించింది.
సెల్ఫీ ఇవ్వాలని కోరినా తమను కాదని ఇతరులకు ఇచ్చాడనే కోపంతో పృథ్వీ షా కారుపై తన స్నేహితులతో కలసి దాడి చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు సప్న గిల్ తో పాటు శోభిత్ ఠాకుక్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మందిపై కూడా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.