పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పుడే ఓటమి భయం మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకత, అనుచరుల భూకబ్జాలు మితిమీరడంతో నియోజకవర్గంలో ఎర్రబెల్లికి ఎదురీత క్రమ, క్రమంగా ప్రారంభమైంది. ఇది చాలదు అన్నట్లుగా ఎన్నారై అనుమాండ్ల ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనుండటంతో ఎర్రబెల్లికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఝాన్సిరెడ్డి గెలుపుకు సోపానాలుగా మారనున్నాయని అంచనా వేసిన ఎర్రబెల్లి పాలకుర్తి నుంచి మకాం మార్చేందుకు రెడీ అయ్యారన్న వాదనలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
మొన్నటివరకు పాలకుర్తిలో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కూడా లేడు. ఇప్పుడు అనుమాండ్ల ఝాన్సీరెడ్డి రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో పార్టీని వీడిన నేతలు, ఎర్రబెల్లి వ్యతిరేకులు అంత ఝాన్సీరెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సిద్దం అవుతున్నారు. వైద్య వృత్తితో అమెరికాలో స్థిరపడినా, పుట్టిన నేలను మరవని ఝాన్సీరెడ్డి పుట్టిన గడ్డకు సేవా చేస్తూనే వస్తున్నది. పాలకుర్తి నియోజకవర్గంలో ఆసుపత్రులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంతోపాటు ఎంతోమందికి ఆర్థికంగా తోడ్పాటును అందించింది. దీంతో ఇరవై ఏళ్లుగా ఝాన్సీరెడ్డికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఏర్పడింది.
సేవా కార్యక్రమాలతో పాలకుర్తికి సుపరిచితమైన ఝాన్సీరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడంతో ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెంటే నడుస్తామని ఊరు, వాడ ఆమెకు మద్దతుగా కదిలింది. ఆమె అమెరికా నుంచి పాలకుర్తికి వచ్చిన రోజున ఝాన్సీకి నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికిన తీరు చూస్తే ఓ ఎన్నారై ఇంతమంది అభిమానం చూరగొన్నారా..? అనే ఆశ్చర్యం కల్గించకమానదు. అలాంటి ప్రజాభిమానం పొందిన ఝాన్సీరెడ్డి ఇప్పుడు పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే.. ఝాన్సీరెడ్డి పాలకుర్తిలో పోటీ చేస్తే ఏకపక్ష విజయం దక్కుతుందని ఆమె ప్రత్యర్ధులు సైతం ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎర్రబెల్లికి అప్పుడే ఎలక్షన్ ఫియర్ పట్టుకుంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగిన తనకు , రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని ఝాన్సీరెడ్డి చేతిలో తీవ్ర పరాభవం ఎదురైతే తన రాజకీయ భవిష్యత్ కే మచ్చగా మారుతుందని ఎర్రబెల్లి భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆయన పాలకుర్తి నియోజకవర్గం నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
పాలకుర్తి టికెట్ కావాలని కేటీఆర్ మిత్రుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీనిని సాకుగా చూపి తనకు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ఎర్రబెల్లి రిక్వెస్ట్ చేయనున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే, జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని, ఆయన భూకబ్జాల బాగోతాన్ని నివేదిక రూపంలో రెడీ చేసి కేటీఆర్ వద్దకు చేర్చి.. జనగామ టికెట్ కు మార్గం సుగమం చేసుకోవాలని ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.