తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై డైలమా కొనసాగుతోంది. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తారా..? జనవరిలో ఉంటాయా..? అనే అంశంపై సస్పెన్స్ వీడటం లేదు. మొదట మిజోరంతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్, తెలంగాణ ఎన్నికలను నిర్వహిస్తారని లీకులు వచ్చినా ఎన్నికల కమిషన్ మొదట మిజోరం ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిజోరం ఎన్నికల అనంతరం నాలుగు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎన్నికలు డిసెంబర్ లో కాకుండా జనవరిలో జరిగితే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరగడంతోపాటు కేసీఆర్ చరిష్మా కూడా మసకబారుతోంది. ఇప్పుడు ఎన్నికలు ఆలస్యం అయితే వ్యతిరేకత మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతాయని కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని అక్కడక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా అభ్యర్థులు ప్రారంభించారు. ఒకవేళ ఎన్నికలు జనవరిలో జరిగితే..అభ్యర్థులకు ఖర్చులు కూడా ఎక్కువ కానున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ ఆశవాహుల నుంచి సహాయనిరాకరణ ఎదురు అవుతోంది. బీఆర్ఎస్ టికెట్ ఆశవహులను ప్రత్యర్ధులు తమ వైపు తిప్పుకుంటే ఎలా..? అనే టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది.
2018లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేసి ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉండటంతో ప్రధాని మోడీ, అమిత్ షా లు ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనలేకపోయారు. ఇదే మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘడ్ లో ఓటమికి కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి శీతాకాల సమావేశాలను మార్చడమో, లేదంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను మార్చడమో చేస్తారన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
Also Read : ఎన్నికలు ఇప్పట్లో లేవు – తెలంగాణలో రాష్ట్రపతి పాలన..?