ఎట్టకేలకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మార్పుపై వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్ లోనే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశారు . ఖమ్మం రాజకీయాలను పొంగులేటి శ్రీనివాస్ తో తన చేతుల్లోకి లాక్కోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఆయనతోపాటు తుమ్మలను కూడా కాషాయ క్యాంప్ లో చేర్చుకోవాలని ట్రై చేసింది. బీజేపీ రాజకీయాలను గమనించిన కేసీఆర్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారు.
ఖమ్మం సభకు ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న హరీష్ రావు ఖమ్మం వెళ్లి తుమ్మలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు తుమ్మల. కేసీఆర్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించి చాలా కాలమే అయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ధిక్కార స్వరం వినిపించిన తుమ్మల అకస్మాత్తుగా వెనక్కి తగ్గడంపై చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ ఖాయమని ప్రకటనలు చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ టచ్ లోకి వెళ్ళింది. దీంతో హరీష్ ను ముందుంచి పాలేరు నుంచి పోటీకి ఆయనకు హామీ ఇచ్చారని ఖమ్మం బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేరినప్పుడే ఆయనకు టిక్కెట్ హామీ ఇచ్చారు. ఇప్పుడేం ఆయన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.