తెలంగాణలో వెస్ట్ బెంగాల్ తరహ రాజకీయం చేసేందుకు టీఆర్ఎస్ – బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయని టి. కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అక్కడ ఎలాగైతే కాంగ్రెస్ బలహీనం చేసేందుకు టీఎంసీ – బీజేపీలు ప్రయత్నించి సక్సెస్ అయ్యాయో… తెలంగాణలోనూ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని టీఆర్ఎస్ – బీజేపీలు వదులుకోవడం లేదు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై బుధవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమంపై జనాల్లో చర్చ లేకుండా చేసేందుకు షర్మిల, బండి సంజయ్ కు టీఆర్ఎస్ మైలేజ్ ఇచ్చిందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం పార్టీలో నిస్తేజం నింపినా దాని నుంచి బయటపడేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనుకున్న హస్తం ఆశలపై టీఆర్ఎస్ నీళ్ళు చల్లేందుకు ప్రత్యర్ధి పార్టీలకు బూస్టింగ్ ఇచ్చింది. ఈ నెల 23న మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసనలతో రైతుల ఆదరణను కొంతమేరకు చూరగొన్న కాంగ్రెస్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలనే రేవంత్ పిలుపుతో పార్టీ శ్రేణులు నిరసనలను చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ప్రగతిభవన్ లో వ్యూహం రచించిన కేసీఆర్.. బండి సంజయ్, వైఎస్ షర్మిలకు మీడియాలో స్పెస్ దక్కేలా చూసుకున్నారని అంటున్నారు.
ఇందుకోసం బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవ సభకు అనుమతి నిరాకరించి ప్రజా సంగ్రామ పాదయాత్రపై చర్చ జరిగేలా చేయగా.. వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించి షర్మిలకు జనాల నుంచి అయ్యో పాపం అనేలా సానుభూతిని రగిల్చారు.బండి సంజయ్ ప్రారంభోత్సవ సభకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకున్నా కోర్టు ఎలాగూ అనుమతినిస్తుంది. అలాగే , షర్మిల పాదయాత్రకు న్యాయస్థానం కొన్ని షరతులను విధించి అనుమతినిస్తుందని సర్కార్ కు తెలిసి కూడా అడ్డుకోవడానికి యత్నించించడం బట్టి రాష్ట్ర రాజకీయాల్లో బెంగాల్ తరహ రాజకీయం చొరబడిందన్న రేవంత్ వాదనలకు తాజా పరిణామాలతో బలం చేకూరినట్లు అయింది. ఫలితంగా కాంగ్రెస్ చేపట్టిన పోరాట కార్యాచరణపై మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేసినట్లు అర్థం అవుతోంది.
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి మరోసారి అధికారం దక్కాలంటే కాంగ్రెస్ బలహీన పడాలని కోరుకున్నట్లు, అసలు 3శాతం ఓటు బ్యాంక్ మాత్రమే కల్గిన బీజేపీకి అనవసర ప్రాధాన్యత ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా మమతా బెనర్జీ అవకాశం ఇచ్చినట్లుగానే తెలంగాణలోనూ టీఆర్ఎస్ హస్తంను తుడిచి పెట్టేందుకు ఈ విధమైన వ్యూహాలను అనుసరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన అస్తిత్వాన్ని పదిలం చేసుకునేందుకు తెగ తాపత్రయపడుతోన్న టీఆర్ఎస్.. తనను బీజేపీ ఎదో ఓ రోజు మింగేస్తుందన్న ప్రమాద సూచికను పట్టించుకోవడం లేదు.