చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ లో కూడా కోవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని అలర్ట్ గా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
కరోనా నిబంధనలను విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. మాస్క్ లను తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను ఉపయోగించడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరికపోవడం ఇలాంటి జాగ్రత్తలను పాటించేలా పౌరులను జాగృతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అయితే, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను గతంలో మనం పాటించినవే.
ఇదిలా ఉండగా.. చైనాలో కేసుల తీవ్రతను చూసి మనం భయపడాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి గణాంకాలను ప్రస్తావించారు.
కేసుల సంఖ్య తక్కువే.
డిసెంబర్ 21 నాటికీ రోజువారీ సగటు కేసుల సంఖ్య 139గానే ఉంది. 2020 మార్చి 31తరువాత ఇదే కనిష్ట స్థాయి కేసులు కావడం విశేషం.
కేసుల పెరుగుదల
కరోనా థర్డ్ వేవ్ లో 2021 డిసెంబర్ 16నుంచి కేసులు వెలుగు చూశాయి. ఆ తరువాత పది రోజుల్లో అంటే డిసెంబర్ 26నుంచి కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కాని ఇప్పుడు మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. నెల క్రితంతో చూస్తే ప్రస్తుతం వారం వారీ సగటు కొత్త కేసులు 30శాతం తక్కువగా ఉన్నాయి. గరిష్టంగా 100కేసులకు మించి నమోదు కావడం లేదు. కేరళలో 67, మహారాష్ట్రలో 22, కర్ణాటకలో 19కేసులే వస్తున్నాయి.
మరణాల రేట్ తక్కువ
కరోనా రూపాంతరం చెందుతోన్న కొద్ది కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది కాని, దేశంలో మరణాల రేట్ తగ్గుముఖం పట్టడం విశేషం. మొదటి విడతలో 1. 25% , సెకండ్ వేవ్ లో 1.07%, థర్డ్ వేవ్ లో కేవలం 0.36% చొప్పున మరణాల రేట్ నమోదైంది. అంటే మరో వేవ్ వచ్చినా మరణాలు అంతగా ఉండే అవకాశం లేదు. అలాగని కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదు.
కేసులు పెరుగుదల ఎందుకు లేదు..?
కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కరోనా టెస్టులు కూడా తగ్గాయి. జనాలు కూడా కరోనా విషయంలో సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంట్లో సొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. టెస్టులు చేయించుకోవడం లేదు. కాబట్టి కేసుల సంఖ్య పెద్దగా కనిపించడం లేదు. అలాగే, మన దగ్గర ఎక్కువమంది కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి బలపడినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే మన దగ్గర కరోనా వ్యాప్తి అధికంగా ఉండకపోవచ్చునని.. కరోనా నిబంధనలను పాటిస్తే చాలునని సూచిస్తున్నారు.