వైఎస్ కుటుంబంలో వార్ ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితం అవుతుందా..? పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా..? కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో అదే కుటుంబానికి చెందిన సునీత పోటీ చేయనున్నారా..? వైఎస్ సొంత కుటుంబంలోనే విపక్షం తయారు కానుందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయనుంది. ఇదే జరిగితే కడప జిల్లాలో వైసీపీ పునాదులు కూలిపోనున్నాయి. వైసీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఇప్పటికే వైసీపీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న సునితారెడ్డికి టీడీపీ నుంచి పరోక్ష మద్దతు అందుతుందని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేతలతోపాటు కడప జిల్లాకు చెందిన బీటెక్ రవి సునీత భర్తకు క్లోజ్ ఫ్రెండ్. దాంతో వైసీపీ విమర్శలు ప్రారంభించింది. అయితే..ఈ ఫ్రెండ్ షిపే టీడీపీకి అస్త్రంగా మారగా…వైసీపీకి సంకటస్థితిని తెచ్చి పెట్టేలా చేస్తోంది.
సునీతాను కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై బరిలో నిలపాలని టీడీపీ భావిస్తోందన్న ప్రచారం ఉండనే ఉంది. ఇదే జరిగితే సానుభూతి ఓట్లతో కడపలో మొదటిసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని.. జగన్ ను కోలుకోలేని దెబ్బతీయడంతోపాటు వైసీపీని డిఫెన్స్ లో పడేయడానికి టీడీపీకి అవకాశం ఉంటుంది.
కడపలో సునీత పోటీ చేయడం వలన ఆ ప్రభావం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ఉంటుంది. అందుకే సునీతను టీడీపీలో చేర్చుకునేందుకు ఆమె భర్త ద్వారా టీడీపీ ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
సునీతకు రాజకీయాల్లోకి రావాలనే అభిలాష లేకపోయినా ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా టీడీపీ గాలం వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో ఏడాదిలో జరిగే కడప ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా సునీత నిలబడేలా చేయడంతో సర్రెడ్డి రాజశేఖరెడ్డి కీలకమైన పాత్ర పోషిస్తారు అనే అంటున్నారు.
అదే కనుక జరిగితే ఆ ప్రభావం మొత్తం కడపలోని ఏడు అసెంబ్లీ సీట్ల మీద పడుతుంది. ఒక విధంగా వైసీపీకి అపుడు అది రాజకీయంగా జీవన్మరణ సమస్యగానే ఉంటుంది అని అంటున్నారు.