సాంప్రదాయవృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నడుం బిగించింది. చేతి వృత్తులు, హస్తకళలు అభివృద్ధి చెందేలా ఆ వర్గాల వారికీ ప్రత్యేకమైన ఋణం అందించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ‘విశ్వకర్మ కౌసల్య యోజన ‘ అనే పథకాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ జన్మదినం రోజునే ఈ పథకాన్ని ప్రారంభించి రూ.13వేల కోట్ల నిధులను మంజూరు చేశారు. దేశంలోని 18 రకాల వృత్తుల వారు తమ వృత్తుల్లో భాగంగా వినియోగించే పరికరాల కోసం ఈ పథకం ద్వారా రుణం తీసుకోవచ్చు.
‘విశ్వకర్మ కౌసల్య యోజన ‘ ఎవరు అర్హులు :
మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారీదారులు అర్హులు. అలాగే రజకులు, కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, రాళ్లుపగులగొట్టేవారు, చర్మకారులు (పాదరక్షలు తయారు చేసేవారు), మేదరులు (గంపలు, చాపలు, చీపురులు తయారుచేసేవారు) ఆటబొమ్మలు తయారుచేసేవారు, నాయి బ్రహ్మణులు (క్షౌర వృత్తి చేసేవారు), మాలలు అల్లేవారు ఈ విశ్వకర్మ కౌసల్య యోజన పథకం ద్వారా ఋణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే పద్ధతి :
https://pmvishwakarma.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా ఋణం పొందేందుకు ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్, పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
ఈ పథకం ద్వారా ఇచ్చే ఋణం ఎంత..?
ఈ పథకం ద్వారా అర్హులకు రెండు దశల్లో రూ. 3 లక్షల వరకు ఋణ సాయం అందిస్తారు. మొదట లక్ష ఆర్థిక సాయం చేసిన తరువాత రెండో విడతలో మరో రెండు లక్షల ఋణం అందిస్తారు. ఈ రుణాన్ని అతి తక్కువ వడ్డీతో వసూళ్లు చేస్తారు. చేతి వృత్తులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కాలంలో ఈ కుల వృత్తులకు స్టైఫండ్ ఇస్తారు. ఈ పథకం పూర్తి సమాచారం కోసం https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
Also Read : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే