తెలంగాణ బీజేపీలో అసంతృప్తుల సెగ చల్లారడం లేదు. బండి సంజయ్ ను అద్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా నియమించినా పార్టీ సెట్ కావడం లేదు. సరికదా అసంతృప్తులు మరింత ఎక్కువయ్యారు. పార్టీలో ప్రాధాన్యత లేదని కొందరు, బీఆర్ఎస్ పై మునుపటి తరహాలో పోరాడటం లేదని మరికొందరు బీజేపీని వీడుతున్నట్లు సంకేతాలు పంపుతున్నారు.
ఈ క్రమంలోనే విజయశాంతి ఇంట్లో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు రహస్యంగా మరోసారి సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పై ఎందుకు బీజేపే కొన్నాళ్ళుగా మెతక వైఖరి అవలంభిస్తుందనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నా హైకమాండ్ ఎందుకు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన వెంటనే రాములమ్మ చేసిన ట్వీట్ ఆ పార్టీలో కలకలం రేపింది.
టీ. బీజేపీ రాజకీయ ఆత్మహత్య చేసుకుందంటున్న శైలిలో ఆమె పోస్ట్ చేశారు. రాజకీయంగా పార్టీ ప్రయోజనాల హత్యలే ఉంటున్నప్పుడు, అవి కార్యకర్తలకు ఆత్మహత్యా సదృశ్యంగా గోచరిస్తున్నప్పుడు, కార్యకర్తలకు ఏమి దిశా నిర్దేశం చెయ్యాలో కూడా ఆ పైనేతలే చెప్పాలని డిమాండ్ చేయడం చూస్తె ఆమె ఈటలను టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల ఈ సీక్రెట్ భేటీపై ఈటల కామెంట్స్ చేయడంతో వాటికి కౌంటర్ గానే రాములమ్మ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా విజయశాంతి అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నట్లు కనిపిస్తోంది. సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని.. రేవంత్ ను పొగడటం చూస్తుంటే ఆమె కాంగ్రెస్ లో చేరుతారని భావిస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంగా విజయశాంతితోపాటు కొండా, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలు ప్రత్యేకంగా సమావేశం అవుతుండటంతో.. వీరంతా ఒకేసారి కాంగ్రెస్ లో చేరుతారా..? అనే అనుమానాలు బీజేపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఒకేసారి కాంగ్రెస్ లో చేరితే మాత్రం ఒక్కసారిగా పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read : కేటీఆర్ కన్విన్స్ చేసినా కసిరెడ్డి మెత్తబడలేదా..?