టీడీపీతో అంటీముట్టినట్లు వ్యవహరిస్తోన్న వంగవీటి రాదా త్వరలోనే జనసేనలో చేరనున్నారని జరుగుతోన్న ప్రచారానికి తాజాగా తెరపడింది. ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో వంగవీటి రాధ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. దీనికి ఒక్క అడుగుతో చెక్ పెట్టేశారు రాధా.
ప్రస్తుతం పీలేరులో సాగుతోన్న లోకేష్ యువ గళం పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు. లోకేష్ తో పాదయాత్రలో కలిసి నడిచారు. పాదయాత్ర విరామ సమయంలో ఆయనతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై లోకేష్ చర్చించారు. పాదయాత్రలో రాదా భాగస్వామ్యం కావడంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వంగవీటి రాధా వచ్చి కలవడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన వంగవీటి రాధా…ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా స్పందన తీరుతెన్నెలను వివరించారు. అనంతరం పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. నడుస్తూనే మధ్యలో తన అనుచరుల్ని లోకేష్ కు పరిచయం చేశారు. దీంతో లోకేష్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించారు.
వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అలాంటి సమయంలో జనసేన నుంచి తమ పార్టీలో ఆయన చేరబోతున్నారనే లీకులు రావడంతో అప్రమత్తమైంది. రాధాతో చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనే కలిసి నడవడంతో పార్టీ మార్పు ప్రచారానికి ముగింపు పడింది.