కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు కోసం ఏర్పాటైన (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) మొదటి భేటీ వాడివేడిగా జరిగినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగినట్లు సమాచారం. రాజస్తాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ తీర్మానం చేసినట్లు రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిసింది. పార్టీలో టికెట్ ఆశవాహులు చాలామంది ఉన్నారని..వారికి అవకాశం ఇద్దామని ఉత్తమ్ కు రేవంత్ సూచించడంతో ఇద్దరి మధ్య కాసేపు వార్ జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ లో మహిళలకు ఎంతమందికి టికెట్లు ఇస్తారని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఈ సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం. మహిళలకు టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కాంగ్రెస్ ఎందుకు చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ వాదన వినిపించారు. ఈ సమావేశంలో పలువురు చెప్పిన అంశాలను నోట్ చేసుకొని వేర్వేరు అభిప్రాయాలపై చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలను తీసుకుంటామని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఇందుకోసం సెప్టెంబర్ 2న గాంధీ భవన్ లో పీఈసీ మొదటి జాబితాపై చర్చించనుంది. ఆ తరువాత 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తోపాటు సభ్యులు అభ్యర్థుల ఎంపికపై జాబితాను ఫైనల్ చేయనున్నారు. మొదటి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఉండేలా లిస్టు ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read : కేసీఆర్ పై విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే..?