వైసీపీ నుంచి బహిష్కరణ వేటుకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు..? టీడీపీలో చేరనున్నారా..? లేక మరో పార్టీని ఎంచుకునే అవకాశం ఉందా..? అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని గట్టి ప్రయత్నాలు చేసింది కానీ జగన్ కరుణించలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసిందని శ్రీదేవిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్ తనకు మైండ్ బ్లాక్ అయ్యే గిఫ్ట్ ఇచ్చారని తాను త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
నిజానికి ఉండవల్లి శ్రీదేవికి పెద్దగా రాజకీయానుభవం లేదు. ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ సతీమణి భారతికి ఉండవల్లి శ్రీదేవి స్నేహితురాలు. ఆవిధంగా తాటికొండ నుంచి ఆమెకు వైసీపీ టికెట్ ఇచ్చింది. గెలుపొంది దళిత సామజిక వర్గం కోటాలో మంత్రి పదవికి కూడా పోటీ పడింది కానీ ఆమెను క్యాబినెట్ లోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఆమె కొంత అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పార్టీతో అనుబంధాన్ని కోల్పోయింది. రాజకీయాల్లోనే కొనసాగుతా.. వైసీపీకి తన పవర్ ఏంటో చూపిస్తానని హెచ్చరికలు జారీ చేస్తోంది శ్రీదేవి.
వైసీపీ నుంచి శ్రీదేవి సస్పెండ్ కావడానికి కారణం ఆమె టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓటేశారని. దాంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరుతారని అంత ఫిక్స్ అయ్యారు. పైగా గత ప్రభుత్వం చేసిన దాంట్లో పదిశాతం కూడా జగన్ చేయలేకపోయారని వ్యాఖ్యానించడంతో టీడీపీలో ఆమె చేరిక లాంచనమేనని భావించారు. కానీ అక్కడ శ్రీదేవికి పోటీగా చాలామంది నేతలున్నారు. దాంతో తాటికొండ టికెట్ దక్కే అవకాశం లేదని అందుకే తన దృష్టిని మరో పార్టీ వైపు మరల్చినట్లు తెలుస్తోంది.
జనసేనలో చేరితే టికెట్ ఖాయమని శ్రీదేవి బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరినా జనసేన నుంచి పోటీ చేస్తే విజయం సునాయాసంగా దక్కుతుందనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా శ్రీదేవి భర్త కాపు సామజిక వర్గానికి చెందిన వ్యక్తి. తాటికొండలో కాపుల ఓట్లు పదిహేను వేల దాకా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి పది వేల ఓట్లకు పైగా వచ్చాయి. అదే సమయంలో జనసేన కూడా భారీగా ఓట్లను రాబట్టుకుంది.
అప్పటికీ , ఇప్పటికీ జనసేన గ్రాఫ్ మరింత పెరిగింది. దాంతో జనసేనలో చేరిత అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే తలంపుతో తాటికొండ ఎమ్మెల్యే ఉన్నారని అంటున్నారు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఇందుకోసం ఎయె మార్గాలు ఉన్నాయని శ్రీదేవి భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.