రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలనే టీపీసీసీ ఆదేశాలతో నేతలంతా దరఖాస్తులు చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ దరఖాస్తులు అందజేశారు. మొత్తం 1000వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో సెగ్మెంట్ నుంచి ఎనిమిది అప్లికేషన్లు వచ్చినట్లు. ఇల్లందు నుంచి అత్యధికంగా 36మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ నుంచి అంజన్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ దంపతులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి అప్లై చేశారు. నాగార్జున సాగర్ , మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారులు దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహతోపాటు ఆయన కుమార్తె త్రిష అప్లై చేసుకున్నారు. ములుగు నుంచి సీతక్క , పినపాక నుంచి ఆమె కుమారుడు సూర్యం దరఖాస్తు చేశారు. కరీంనగర్ నుంచి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు ,ఆమె కుమారుడు రితేష్ రావు దరఖాస్తు సమర్పించారు.
ఇదిలా ఉండగా.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం మూడుచోట్లలో ఏదో ఒక స్థానం నుంచి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అనూహ్యంగా ఎల్బీ నగర్ నుంచి దరఖాస్తు చేశారు. నిజామాబాద్ కు చెందిన మధుయాష్కీ ఎల్బీ నగర్ నుంచి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ టికెట్లు ఇవ్వొద్దని ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఇద్దరికీ ఇవ్వాల్సి వస్తే కొత్తగా పోటీలో నిలవాలనుకున్న వారు ఐదేళ్ళు పార్టీలో పని చేసిన అనుభవం ఉండాలని తీర్మానం చేసింది.