అతికి మారుపేరు టీవీ9. ఏ న్యూస్ అయిన తామే ముందుగా ప్రసారం చేయాలనే తాపత్రయంతో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ అలవాటు ఎంతవరకు వెళ్లిందంటే.. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వచ్చిందని ప్రసారం చేసే వరకు వెళ్ళింది. ఇంతకీ విషయమేంటంటే…అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణే జరగలేదు. కాని తీర్పు వచ్చేసిందని.. విశాఖపట్నం రాజధానికి అడ్డంకులు తొలగిపోయాయని బ్రేకింగ్ ప్రసారం చేసింది.
బుధవారం ఉదయం పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న సమయంలో టీవీ9 బ్రేకింగ్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని..దాంతో విశాఖపట్నం రాజధాని చేయాలన్న సర్కార్ నిర్ణయానికి ఇక లైన్ క్లియర్ అయినట్లేనని ఆ బ్రేకింగ్ సారాంశం. పేరుమోసిన చానెల్ కావడంతో అందరూ నిజమేననుకొని క్రాస్ చెక్ చేసుకున్నారు.
తీరా ఈ అంశంపై ఏడో తేదీన విచారణ జరగనుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో కనిపించింది. దాంతో టీవీ9 వాలకంపై విమర్శల మోత మోగింది. కాసేపటికే ఆ బ్రేకింగ్ లను ఆపేశారు. సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగకుండానే స్టే ఇచ్చిందని టీవీ9ప్రసారంచేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ తప్పుడు కథనానికి మెరుగైన ఛానెల్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు.
రాజధానిగా అమరావతికి టీవీ9 వ్యతిరేకం. ఈ విషయం అందరికీ తెలుసు. తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలోనున్న టీవీ9… అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుకోరు. వారి ఉద్దేశ్యం వాళ్లకు ఉండొచ్చు కాని.. ఇలా సుప్రీంకోర్టు విచారణ జరక్కుండానే విచారణ జరిగిందని చెప్పడం ప్రజలను ఫూల్స్ చేయడమే. ఇలాంటి నిరాధార కథనాల వలనే టీవీ9 రేటింగ్ కోల్పోయింది. ఆ ఛానెల్ కథనాలను కూడా ఎవరూ విశ్వసించని స్థాయికి దిగజారింది.