మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయింది. అక్టోబర్ మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. శుక్రవారం బెంగళూర్ వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి.. తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ పై హామీ కోరినట్లుగా తెలిసింది. అయితే.. తుంగతుర్తి టికెట్ మోత్కుపల్లికి ఇస్తే ఇదే స్థానం నుంచి మరోసారి పోటీ చేసి ఈసారి విజయం సాధించాలని ప్లాన్ చేసుకుంటున్న అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటన్నది బిగ్ డిబేట్ గా మారింది.
2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ పై ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం గెలుపు తనదేనని ధీమాతో అద్దంకి దయాకర్ ఉన్నారు. కానీ దయాకర్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండడనే అపవాదు ఉంది. దీంతో అక్కడి నుంచి స్థానికంగా అందుబాటులో ఉండే నేతకు టికెట్ ఇవ్వాలంటూ ముగ్గురు నేతలు లాబియింగ్ చేస్తున్నారు. వడ్డేపల్లి రవి, ప్రీతంలు తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వడ్డేపల్లి రవికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సపోర్ట్ ఉంది. ఆయన ఈసారి పార్టీ టికెట్ పై గట్టి పట్టుతోనే ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు నేతల మధ్య టికెట్ ఫైట్ హోరాహోరీగా సాగుతుంటే ఇప్పుడు మోత్కుపల్లి కూడా ఎంటర్ అయ్యారు.
తుంగతుర్తి నుంచి మోత్కుపల్లి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే విషయమై డీకే శివకుమార్ తో చర్చించినట్లు సమాచారం. టికెట్ పై హామీ ఇచ్చారో లేదు స్పష్టత లేదు కానీ.. ఆయన తుంగతుర్తి టికెట్ కోరుతుతున్నారనే విషయం బయటకు రావడంతో ఈ ముగ్గురు నేతలు అలర్ట్ అయ్యారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం పని చేసిన తమను విస్మరించి ఇప్పుడు పార్టీలోకి వస్తున్నా నేతకు ఎలా టికెట్ ఇస్తారంటూ అనుచరుల వద్ద వాదిస్తున్నారట. తుంగతుర్తి టికెట్ పై తాడో పేడో తేల్చుకునేందుకు ముగ్గురు నేతలు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : బీఆర్ఎస్ కు వరుస షాకులు – కాంగ్రెస్ లోకి మాజీమంత్రి..!