టీఎస్ పీఎస్సీ పరీక్ష లీకేజీ వ్యవహారంలో అసలు విషయాన్ని కప్పి పుచ్చేందుకు తెరవెనక ఏదో జరుగుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఓ వైపు పోలిసుల ప్రకటనలు సందేహాలను రెట్టింపు చేస్తుండగా…టీఎస్ పీస్సీ చైర్మన్ చేస్తోన్న ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇంత కీలకమైన విషయంలో టీఎస్ పీస్సీ చైర్మన్ ప్రకటనలు నిరుద్యోగుల్లో లేవనెత్తుతోన్న అనుమానాలను రెట్టింపు చేసేలా ఉన్నాయి.
ఏఈ పరీక్ష పేపర్ లీక్ పై టీఎస్ పీస్సీ చైర్మన్ :
ఏఈ పేపర్ మాత్రమే లీకేజీపై మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. ఏఈ పేపర్ లీక్ పై ఎవరో వచ్చి ఉద్యమాలు చేయలేదని…తామే గుర్తించి కంప్లైంట్ చేశామని జనార్ధన్ రెడ్డి తెలిపారు. కానీ అసలు విషయం ఏంటంటే… ఈ కేసులో కీలక నిందితురాలిగానున్న రేణుకకు , పేపర్ కొనుగోలు చేసిన అభ్యర్థులతో గొడవ జరగడంతో అభ్యర్థులే ఈ పేపర్ లీక్ విషయాన్ని బయటపెట్టారు. కానీ జనార్ధన్ రెడ్డి మాత్రం అసలు వాస్తవాన్ని తొక్కిపెట్టి…తామే ఈ విషయాన్ని గుర్తించామని గొప్పగా ప్రకటించుకున్నారు.
లీక్ విషయం ఇలా బయటకొచ్చింది :
టీఎస్ పీస్సీ ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఏఈ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతోపాటు మరికొందరు వనపర్తిలో పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలోనే రేణుక, పేపర్ కొనుగోలు చేసిన అభ్యర్థులను డబ్బులు ఏమైయ్యాయని ప్రశ్నించింది. పూర్తి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పార్టీ మూడ్ లోనున్న అభ్యర్థులు రేణుకతో గొడవ పడ్డారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన అభ్యర్థులు అక్కడి నుంచే డయల్ 100కు కాల్ చేసి విషయం మొత్తం కక్కేశారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ టీఎస్ పీఎస్సీ చైర్మన్ మాత్రం తమకు ఏఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఎవరు ఫిర్యాదు చేయలేదని… తామే గుర్తించామని చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. టీఎస్ పీస్సీలో ప్రవీణ్ కు మరెవరైనా అధికారులు సహకరించారనే తెలిసి.. వారిని కాపాడుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
పోలిసుల దాగుడుమూతలు :
టీఎస్ పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోన్న పోలీసుల వైఖరిపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు. మొదట టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రకటించారు. ఆ తరువాత టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ కాలేదు.. కేవలం అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందని ప్రకటించారు. ఇక్కడే నిరుద్యోగులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎందుకు ఇలా పూటకో మాట చెబుతున్నారని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సర్కార్ నుంచి ఒత్తిళ్ళతోనే పోలీసులు ఇలా మాట్లాడుతున్నారా..? అని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఓ మాట చెబుతుండగా… టీఎస్ పీస్సీ అధికారులు భిన్న ప్రకటనలు చేస్తుండటంతో ఈ ఇష్యూలో అసలు విషయాలను బయటరాకుండా చేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ ఫోన్, లాప్ టాప్, పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వివరాలను చూసి నోర్లు వెళ్ళబెట్టారు. ఏఈ పరీక్ష పత్రం మాత్రమే కాదు పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు అందులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే బయటికి మాత్రం కేవలం ఈ పరీక్ష పత్రం మాత్రమే లీక్ అయిందని చెబుతున్నారు. మిగతా ప్రశ్నపత్రాలు తెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రహస్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
Also Read : ఇప్పటివరకు లీకైన పేపర్లేన్ని…? సర్కార్ ఎందుకు భయపడుతోంది?