టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారం తెలంగాణ సర్కార్ ను కుదిపేస్తోంది. ఈ పేపర్ లీక్ తో మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉందని కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అద్యక్షులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ల నిర్వహణ బాధ్యత ఐటీ శాఖదే కాబట్టి ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పేషి నుంచే పేపర్ లీక్ జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని రేవంత్ ఆరోపిస్తుండగా… బండి సంజయ్ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే పనిని సర్కార్ ముంగిట వేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ పేపర్ లీకేజీలో దర్యాప్తు చేస్తోన్న సిట్ చేత కేసులు పెట్టించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పెద్దలు బిజీగా ఉన్నారు. గురువారం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ శుక్రవారం బండి సంజయ్ ను విచారించనుంది. ఆ తర్వాత వాళ్ళు చేసిన రాజకీయ ఆరోపణలపై కేసులు పెడుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పేపర్ లీకేజీలో కేటీఆర్ పాత్ర ఉందని రేవంత్ ఫిర్యాదు చేస్తే సిట్ అధికారులు ఫిర్యాదును తీసుకోలేదు. అంటే సిట్ ఎవరి డైరక్షన్ లో పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
కేటిఆర్ ఎదురుదాడి?
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి , బండి సంజయ్ లు తనపై చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ లీగల్ నోటిసులు జారీ చేశారు. నిజానికి రాజకీయాల్లో ఆరోపణలు సాధారణం. రేవంత్ చేసిన రాజకీయ ఆరోపణలపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాల్సింది.కానీ అలా చేయలేదు. కేటీఆర్ మీద రేవంత్ ఆరోపణలు చేసిన ప్రతిసారి కోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకోవడం…లీగల్ నోటిసులు ఇవ్వడం కేటీఆర్ కు పరిపాటిగా మారింది.
ఇప్పుడు తెలంగాణను కుదిపెస్తోన్న పేపర్ లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిర్దిష్టమైన ఆరోపణలు కేటీఆర్ మీద చేస్తే బాధ్యతయుతమైన మంత్రిగా కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి. పేపర్ లీకేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. పేపర్ లీక్ తో కేటీఆర్ కు సంబంధముందని రేవంత్ మీడియా ప్రదర్శిస్తోన్న ఆధారాలను తప్పు అని ప్రజలకు బహిరంగంగా చెప్పాలి. అంతేకాని తనపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ లీగల్ నోటిసులు పంపడం చూస్తుంటే విషయాన్నీ పక్కదోవ పట్టించాలనే ఉద్దేశ్యం అయి ఉండొచ్చుననే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ మీద కేసుల నమోదు చేయాలనే ఆలోచన వ్యూహాత్మకంగానే సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎప్పటి నుంచో ఈ పేపర్ లీకేజీ జరుగుతుందని రేవంత్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఈ విషయం నిరుద్యోగులకు చేరితే తాము మోసపోయామని వారిలో అసహనం పేరుకుపోతుంది. సర్కార్ మీద తిరుగుబావుటా ఎగరేసేందుకు కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పరీక్షలు నిర్వహించిన నిరుద్యోగుల్లో సర్కార్ పై నమ్మకం కుదరదు. అందుకే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలనే కుట్రకు సర్కార్ తెరలేపిందని ఆరోపణలు వస్తున్నాయి.