తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని సర్కార్ ఆందోళన చెందుతుందా..? ఈ కేసులో అసలు వాస్తవాలు మరుగున పరిచేందుకు పోలిసులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారా..? ఈ సీరియస్ అంశంపైన సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షపాత విచారణకు ఆదేశించాల్సిన సర్కార్, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో కొనసాగే సిట్ ను ఏర్పాటు చేయడం కుట్రలో భాగమేనా..? నిందితుడి ప్రవీణ్ ను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను మరింత ఆలస్యం చేయాలని సర్కార్ కుట్రలు చేస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీఎస్ పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోన్న పోలీసుల వైఖరిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు. మొదట టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రకటించారు. ఆ తరువాత టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ కాలేదు.. కేవలం అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందని ప్రకటించారు. ఇక్కడే నిరుద్యోగులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎందుకు ఇలా పూటకో మాట చెబుతున్నారని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సర్కార్ నుంచి ఒత్తిళ్ళతోనే పోలీసులు ఇలా మాట్లాడుతున్నారా..? అని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ప్రస్తుతం ఏఈ క్వశ్చన్ పేపర్ లీకేజీలో నిందితురాలిగా నున్న రేణుక గురుకుల టీచర్ గా పని చేస్తోంది. ఇదే కేసులో కీలక నిందితుడిగానున్న ప్రవీణ్ కు 2017నుంచే ఆమెతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ 2017లో టీఎస్ పీఎస్సీలో ఉద్యోగంలో చేరగా…రేణుక 2018లో గురుకుల టీచర్ గా ఉద్యోగంలో చేరింది. దాంతో రేణుకకు గురుకుల టీచర్ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రవీణ్ ఏమైనా సహాయం చేశాడా.? అనే అనుమానాలు వస్తున్నాయి. నాడు జరిగిన గురుకుల పేపర్ కూడా లీక్ అయి ఉండొచ్చునని నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలపై తమకు అనుమానాలు ఉన్నాయని విద్యార్ధి సంఘాలు ఆందోళనను ఉదృతం చేయగానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఏఈ, టౌన్ ప్లానింగ్…రెండు పేపర్లూ లీక్ అయినట్లు తేల్చడం సంచలనంగా మారింది.
ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ క్వశ్చన్ పేపర్ మాత్రం లీక్ అయిందని పోలీసులు రెండు రోజుల కిందట మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం రెండు క్వశ్చన్ పేపర్లూ లీక్ అయినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 24పేజీల ఏఈ క్వశ్చన్ పేపర్ తోపాటు, 25పేజీల టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ క్వశ్చన్ పేపర్ జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. దాంతో టీఈబీవో పేపర్ కూడా లీక్ అయినట్లు స్పష్టం అవుతోంది. ఎందుకు ఉద్యోగ అర్హత పరీక్ష విషయంలో పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా అనేక అనుమానాలను కల్గించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
ఏఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలో నిందితుడిగానున్న కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కు గ్రూప్ 1ప్రిలిమ్స్ ఎగ్జాంలో ఏకంగా 103మార్కులు రావడంతో… టీఎస్ పీస్సీ నిర్వహించిన అన్ని పరీక్షల్లో లీకేజ్ జరిగి ఉండొచ్చునని అనే అనుమానాలకు తాజాగా బలం చేకూరుతోంది. దీంతో సిట్టింగ్ జడ్జితో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలపై అవకతకవలు జరిగాయా.? లేదా అని విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తే… ప్రభుత్వం మాత్రం తమ కనుసన్నలో పని చేసే సిట్ ను ఏర్పాటు చేయడంతో ఈ వ్యవహారంలో ఎదో జరుగుతుందన్న అనుమానాలు కల్గుతున్నాయి.
నిజానికి ఉద్యోగ నియామకాల విషయంలో సర్కార్ మొదటి నుంచి నిర్లక్ష్యం వహిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి… అందులో అనేక కొర్రీలు పెడుతూ కోర్టు మెట్లు ఎక్కేలా ప్రభుత్వమే చేస్తోంది. దీంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. గతేడాది ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం..ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయింది. దీంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతోంది. మంత్రులను , ఎమ్మెల్యేలను ఎక్కడిక్కడ నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే లీకేజ్ వ్యవహారం చోటుచేసుకోవడంతో ఉద్యోగ నియామకాలను ఈ సాకుతో మరింత నాన్చవచ్చుననే ఆలోచనతో కేసీఆర్ సర్కార్ ఉందని ఆరోపిస్తున్నారు. అందుకే ఈ కేసులో విచారణ వేగవంతం చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందని చెబుతున్నారు.
ఇక వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని సర్కార్ వ్యూహత్మంగా వ్యవహరిస్తోంది. లీకేజీతో ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా వివరిస్తున్నప్పటికీ అందరూ ప్రభుత్వం నియమించిన అధికారులు, ఉద్యోగులే ఆ నియామక మండలిలో ఉన్నారు. పరీక్ష పేపర్లు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంతా కూడా చైర్మన్ పర్యవేక్షణలోనే ఉంటుంది. ఒక సాధారణ ఉద్యోగికి పాస్వర్డ్ ఎలా దొరుకుతుంది.? ఈ లీకేజ్ వ్యవహారంలో మరెవరైనా అధికారుల హస్తం ఉందా..?అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. వీటన్నింటిని సునిశితంగా పరిశీలిస్తే ఈ విషయాన్ని టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యం వరకే ఎలా పరిమితం చేయగలం. ఇందులో సర్కార్ అసమర్ధత కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : TSPSCపేపర్ లీకేజ్ లో మరో ట్విస్ట్… అసలు విషయం ఏంటంటే..?