తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇంకా ఎవరూ మార్చిపోనేలేదు. అప్పుడే మరో పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేసినట్లు ప్రకటించారు.
ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఒవర్సీర్ పరీక్ష, మార్చి 15,16న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది.కానీ ఇందుకు సంబంధించిన పరీక్షా పేపర్ లు లీక్ అయినట్లు గుర్తించడంతో ఈ పరీక్షలను వాయిదా వేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు.
మొదట కంప్యూటర్ హ్యాక్ అయిందని ప్రచారం చేశారు కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ తో ఇది జరిగినట్లు స్పష్టం చేశారు. కంప్యూటర్ హ్యాక్ కావడంతో పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పడంతో మొదట ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆతరువాత ఒక్క కంప్యూటర్ హ్యాక్ కాలేదని నిర్దారించుకున్నారు. ఓ యువతి వలలో చిక్కిన సంస్థ ఉద్యోగే ఈ పరీక్ష పేపర్ లీక్ చేసినట్లు తేల్చారు పోలీసులు.
టీఎస్ పీస్సీ ఉద్యోగి ప్రవీణ్ పై యువతి వల విసిరిందని…ఆ వలలో చిక్కుకున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఎవరెవరు ఆఫీసుకు వస్తున్నారు.ప్రవీణ్ కు ఎవరు కలుస్తున్నారని సీసీ కెమరాలను చెక్ చేశారు. కొంతకాలంగా ఓ యువతి తరుచుగా ఆఫీసుకు వస్తుందని.. ఆమె ప్రవీణ్ ను కలుస్తుందని సీసీ కెమెరాలలో గుర్తించారు.
ప్రవీణ్ తో సన్నిహితంగా మెదులుతున్న ఆ యువతి టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. పేపర్ లీక్ చేస్తే ఏమైనా సహాయం చేస్తానని ఆఫర్ చేసిందో మరేదైనా కారణమో తెలియదు కానీ యువతి కోరిక మేరకు పేపర్ ను లీక్ చేశాడు.దాంతో నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వలపు ఎర యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.