టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ప్రగతి భవన్ లో సమాలోచనలు జరుపుతోంది. అందుబాటులోనున్న మంత్రులు కేటీఆర్ , హరీష్ రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితోపాటు మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణిలతో కేసీఆర్ అత్యసవరంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ అరా తీస్తున్నట్లు సమాచారం.
గతేడాది నిర్వహించిన గ్రూప్-1పరీక్షతోపాటు ఏఈ , టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. మొత్తం ఐదు పేపర్లు లీక్ అయినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఈ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగానున్న ప్రవీణ్ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో జాయిన నాటి నుంచే…టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలను లీక్ చేసి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష, విద్యార్ధి, నిరుద్యోగ సంఘాల డిమాండ్ మేరకు గ్రూప్ 1తోపాటు ఏఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.
మరోవైపు విద్యార్ధి సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో జర్నలిస్ట్ విఠల్ సంచలన ఆరోపణలు చేశారు. 2016లో నిర్వహించిన గ్రూప్ 1రీఎగ్జాంలో కవిత అనుచరులకు పరీక్ష కేంద్రంలో సహకారం అందిందని…దీని వెనక కవిత హస్తం ఉందని.. ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. విఠల్ చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనానికి దారి తీసాయి. ఇక, ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రం అట్టుడుకుతుంటే గత నాలుగు రోజులుగా ఏమాత్రం పట్టని కేసీఆర్… కవితపై ఆరోపణలు రాగానే ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసు అటు, ఇటు పోయి కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకునేలా ఉందని.. అందుకే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నాడని ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్టాలు చేస్తుందని గ్రహించిన కేసీఆర్… దీని నుంచి బయటపడేందుకు టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని చూస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే ప్రగతి భవన్ లో కేసీఆర్ అత్యంత సన్నిహిత నేతలు , అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ను రద్దు చేస్తే పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎవరికీ అప్పగించాలి..? ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ను రద్దు చేస్తే ఉద్యోగ పరీక్షల నిర్వహణ ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుంది..? అనే అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
ఇక ఈ కేసుకు బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని రాజీనామా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.