బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ప్రభుత్వ ఆర్థిక సాయం గడువును పొడగించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీని చివరి తేదీగా సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ ఆర్ధిక సాయం పొందేందుకు కావాల్సిన కుల, ఆదాయం దృవీకరణ పత్రాల జారీలో ఆలస్యం అవుతోంది. ఈ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల ఎదుట జనాలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి.
మరోవైపు అధికారులంతా దశాబ్ది ఉత్సవాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం అవుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గడువులోపు కుల వృత్తుల్లో అర్హులైన వారందరికీ సర్కార్ సాయం అందుకునేందుకు ఉండాల్సిన ఆదాయ, కుల దృవీకరణ పత్రాలు పొందే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఫలితంగా ఎంతోమంది అర్హులైన వారు సర్కార్ సాయం పొందే అవకాశం కోల్పోనున్నారు. ఇది సర్కార్ కు ఓ రకమైన ఇబ్బందే.
కొంతమందికి మాత్రం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందింది. మిగతా వారికీ సాయం అందలేదని బీఆర్ఎస్ పై కుల వృత్తుల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది.ఈ పథకానికి అప్లై చేసుకునే వారు ఇంకా చాలామంది ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గడువును మరో పదిరోజులు పొడగిస్తే ఎలా ఉంటుందని అనే అంశంపై సర్కార్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగు రోజులు వేచిచూసి ఆ తరువాత ప్రభుత్వం గడువు పెంచుతూ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ – కేసీఆర్ కీలక నిర్ణయం..?