తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మనస్సు పారేసుకున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఇందుకు సంబందించిన ప్రక్రియ వచ్చే నెల ఏడో తేదీ లోపు పూర్తి కానుంది. దీంతో ఆయన కార్యక్షేత్రాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చనున్నారు. హస్తిన వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఆవశ్యకత, విధి, విధానాలు అక్కడే ప్రకటించనున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలంటే ముందు రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. మరోసారి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతున్నా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తున్నారు. మరోవైపు , కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ శ్రేణులు కూడా కేసీఆర్ తరువాత సీఎం చైర్ లో ఉండబోయేది కేటీఆరేనని అంటున్నారు. స్వయంగా మంత్రులే ఈ ప్రకటనలు చేసినా వారిని ఎవరూ వారించలేదు.
మొత్తంగా కేసీఆర్ వచ్చే ఆరు నెలలపాటు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే ముందస్తుకు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం లేదని అంటున్నారు. అయితే , ఆల్ ఆఫ్ సడెన్ గా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై రకరకాల చర్చ నడుస్తోంది. ఎందుకీ భేటీ అని రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నాయి. ఏదీ ఏమైనా, టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అనంతరం ముందస్తు ఎన్నికలతోపాటు, కేటీఆర్ సీఎం అనే ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.