చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటనలో విషాదం నెలకొంది. ఆయన రోడ్ షో కు జనం భారీగా తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది.
రోడ్డు పక్కనే ఓపెన్ కాలువలు ఉండటం వలన తోపులాట చోటు చేసుకోవడంతో ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జరిగిన ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి మృతులను, క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళారు. గాయపడిన వారిని పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి.. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులకు అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
మృతి చెందిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. ఇంటికి వెళ్ళే పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఘటన జరిగిన తరువాత చంద్రబాబు రాజకీయ అంశాల జోలికి వెళ్ళలేదు.
ఇటీవల, చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. కందుకూరులో టీడీపీ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే గెలిచింది కాని జనం ఊహించని విధంగా తరలి వచ్చారు. రోడ్డు సరిపోకపోవడంతో తోపులాట జరగగా.. ఓపెన్ కాలువల వలన ఎనిమిది మంది మృతి చెందారు.