ఒక్కటిగా కలిసి ఉన్నారనుకున్న భూమా కుటుంబ సభ్యులు రాజకీయాలు మాత్రం ఎవరికీ వారుగా చేస్తున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల టికెట్ పై ఎవరికీ వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఎవరికీ వచ్చినా సహకరించుకుందామని ఫిక్స్ అయి విడివిడిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కానీ క్యాడర్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతోంది.
భూమా దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి రెండు సీట్ల కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉండగా…నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ ఇద్దరికీ టికెట్లు కన్ఫాం అని ప్రచారం జరుగుతోన్న వేళ భూమా మౌనిక రెడ్డి తన భర్త మంచు మనోజ్ తో కలిసి చంద్రబాబును కలవడం చర్చనీయాంశం అవుతోంది.
రాజకీయాలపై మౌనికకు ఆసక్తి ఉంది. అనర్గళంగా మాట్లాడగలదు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో మౌనికా గర్భవతిగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను తన ప్రసంగంలో ఆకట్టుకుంది. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకున్నా తరువాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ పార్టీ అధినేతతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
మౌనిక రెడ్డి తన సోదరి ఇంచార్జ్ గానున్న ఆలగడ్డ టికెట్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నంద్యాలలో భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీలో ఉంటానని బహిరంగంగా చెబుతున్నారు. బ్రహ్మానంద రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నప్పటికీ తను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. దాంతో భూమా కుటుంబంలో రాజకీయంగా ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.