మాజీమంత్రి, బీఆర్ఎస్ అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సత్తుపల్లి గంగారం ఫామ్ హౌజ్ లో తన అనుచరులతో సమావేశమైన తుమ్మల నాగేశ్వర్ రావు వారితో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చిన తుమ్మల తాజాగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6న కాంగ్రెస్ లో చేరాలని తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి బీఆర్ఎస్ ను వీడటంతో బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఖమ్మం జిల్లాలో మరో బలమైన నేతగానున్న తుమ్మల కూడా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. తుమ్మలను బీఆర్ఎస్ ను వీడకుండా చూడాలంటూ కేసీఆర్ మంత్రి హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఇస్తామని.. బీఆర్ఎస్ ఢిల్లీ వ్యవహారాలన్నీ నీ చేతుల్లోనే ఉంచుతామని కీలక ఆఫర్లు తుమ్మల ముందుంచాలని హరీష్ ద్వారా తుమ్మలకు కేసీఆర్ రాయబారం పంపారు.
రాజ్యసభ కంటే కూడా తుమ్మల పాలేరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి ఓటమి పాలైన తనను కాదని, కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం పట్ల తుమ్మల అసంతృప్తిగా ఉన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సమయంలో తుమ్మలను కన్విన్స్ చేసే బాధ్యతను హరీష్ కు అప్పగించారు. మళ్ళీ ఆ సభ తరువాత తుమ్మలను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న తుమ్మల… ఇప్పుడు రాజ్యసభ హామీ ఇచ్చినా, ఎన్నికల తరువాత తనను మళ్ళీ పక్కన పెడ్తే ఎలా..? అనే ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తుమ్మల బీఆర్ఎస్ ను వీడకుండా కేసీఆర్ చాలా ప్రయత్నాలే చేశారు అదే సమయంలో కాంగ్రెస్ శరవేగంగా పావులు కదిపింది. ఆయనతో అంతర్గంతంగా చర్చలు నడిపింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా తుమ్మలతో మాట్లాడినట్లు సమాచారం.
Also Read : తుమ్మలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ – కాంగ్రెస్ లో చేరికపై వెనక్కి తగ్గుతాడా.?