పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విక్టరీతో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం టీడీపీ ఖాతాలో పడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అసెంబ్లీలో 19మంది సభ్యుల బలముంది. ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిస్తే టీడీపీ నుంచి మరొకరు మండలికి వెళ్తారు. ఇలా జరిగితేనే మరో ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు సరిపడ బలం లేకపోయినా ఖచ్చితంగా గెలుపు మాదేనని టీడీపీ బలగుద్ది మరీ చెబుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు చంద్రబాబు. బీసీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. ఈమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 23మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ ఆ పార్టీకి 19మంది నేతల బలమే ఉంది. అయినా మీరు చూస్తుండండి..అనురాధ అనూహ్య విజయం సాధిస్తారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధీమాగా చెబుతున్నారు. ఆయన ధీమాకు కారణం ఏంటో స్పష్టంగా తెలియదు కానీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా ఓటేస్తారని ఆయన భావిస్తు ఉండొచ్చు.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ వైపు నిలిచే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. వీరి ఆత్మ ప్రభోదం సైకిల్ కే ఓటు వేయమని అంటుందని అంటున్నారు. ఇక మరో ఇద్దరు వైసీపీ వైపు నుంచి వచ్చి ఓటేసినా లేక గైర్ హాజరు అయినా అది టీడీపీకే మేలు చేస్తుంది. ఈ లెక్కన టీడీపీ నుంచి మండలికి మరొకరు వెళ్ళడం ఖాయం.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయితే వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడమే కాదు అది టీడీపీకి మేలు చేస్తుంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు వంతున అదే విధంగా గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపైన నమ్మకం లేక వైసీపీ అధిష్టానం నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
Also Read : జగన్ కు శఠగోపం పెట్టిన ‘ఐ ప్యాక్’ టీమ్..!?
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో టికెట్ దక్కదని భావిస్తోన్న నేతలు టీడీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు అనర్హత వేటు వేసినా పరవాలేదని ఎమ్మెల్యేలు అనుకుంటే టీడీపీకి రావాల్సిన 23 ఓట్ల కంటే ఎక్కువగా పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అందుకే మా గెలుపు పక్కా అని పయ్యావుల కేశవ్ లాంటి వారు గట్టిగా చెబుతున్నారు అని అంటున్నారు.
Also Read : టీడీపీలోకి ఆర్ఆర్ఆర్…అక్కడి నుంచి పోటీ..?