బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధం ప్రారంభించడంతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటిని ముట్టడించారు. అరవింద్ నివాసం వద్ద విధ్వంసం సృష్టించారు. ఇంటి అద్దాలతోపాటు కారు అద్దాలను ధ్వంసం చేస్తుంటే పోలీసులు కళ్ళప్పగించి చోద్యం చూశారు. చేయాల్సిందంతా చేశాక వారిని వెనక్కి పంపించారు. ఈ ఘర్షణ ముగిసాక తెలంగాణ భవన్ లో కవిత ప్రెస్ మీట్ పెట్టింది.
అరవింద్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కవిత. ఇష్టారీతిన తనపై వ్యాఖ్యలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎంపీ అరవింద్ ఫేక్ డిగ్రీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ తెలిపింది. తనను బీజేపీలో చేరాలని బీజేపీ నేతలు ఆహ్వానించిన మాట నిజమేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర రాజకీయాలను తెలంగాణలో ప్రవేశ పెట్టాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్కసారి కాదు చాలా సార్లు తనను పార్టీలో చేరాలంటూ సంప్రదించారని కవిత వెల్లడించింది.
కవిత చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకొస్తున్నాయి. ఎంపీ అరవింద్ ది ఫేక్ డిగ్రీ అని చాన్నాళ్ళుగా ఆరోపణలు వస్తున్నాయి. కాని ఏనాడూ ఫేక్ సర్టిఫికేట్ పై ఆమె గట్టిగా మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో, బీజేపీ నేతలు పార్టీలో చేరాలని కవితను సంప్రదిస్తే ఇన్నాళ్ళు ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించిందని అరవింద్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నది రాజకీయ పండితుల వాదన. లిక్కర్ స్కాంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక, కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తోన్న నేపథ్యంలో కవిత బీజేపీ శరణు కోరే అవకాశం ఉంటుంది కాని, కాంగ్రెస్ లో చేరాలనుకునే ఛాన్స్ లేదన్నది వారి అభిప్రాయం.
అరవింద్ మాత్రం ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందంటూ ప్రకటించారు. మీడియా ముంగిటకు వచ్చిన ప్రతిసారి అరవింద్ కేసీఆర్ కుటుంబ సభ్యులపై సెటైర్లు వేసినా.. వారు ఎవరూ ఆయన వ్యాఖ్యలను పట్టించుకునే వారు కాదు. ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోని కవిత ఈసారి మాత్రం తన సహజశైలికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం పథకం ప్రకారమే జరిగి ఉంటుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ అరవింద్ ను రంగంలోకి దించితే …లిక్కర్ స్కాం ఉదంతాన్ని డైవర్ట్ చేసేందుకు టీఆర్ఎస్ కవితను రంగంలోకి దించిందని అంటున్నారు. రెండు పార్టీలు తమకు అంటుకున్న మరకలను తొలగించుకునేందుకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెబుతున్నారు.