ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ టీమ్ గా ముంబై ఇండియన్స్ కు పేరుంది. ఇదుసార్లు టైటిల్ ను కైవసం చేసుకున్న ఆ జట్టు గత రెండు సీజన్ల నుంచి మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుంది. ప్రపంచస్థాయి ఆటగాళ్ళతో ఆ జట్టు బలంగా కనిపిస్తోన్న ఆటలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోతుంది. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంకు పరిమితమైంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మలు కూడా ఘోరంగా విఫలం అవుతున్నారు .
ఈ సీజన్ మొదటి మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ పూర్తిగా నిరాశపరిచింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ (10), రోహిత్ శర్మ (1), కామెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15) ఇలా ఒక్కొక్కరు వెనువెంటనే ఓటై పెవిలియన్ కు క్యూ కట్టారు.పది బంతులను ఎదుర్కొన్న రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్ కు యత్నించగా ఆర్సీబీ ప్లేయర్ల మధ్య సమన్వయం లేక ఓసారి జీవధానం పొందిన ముంబై సారధి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఆ తరువాత కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్రీన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ అంచనాలు ఉన్న సూర్య కుమార్ యాదవ్ కూడా బ్యాట్ ను ఝులిపించలేకపోయాడు. ఇలా 50పరుగుల లోపే నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ఔటై పోవడంతో ముంబై వంద స్కోర్ అయినా చేస్తుందా..? అనే అనుమానం కల్గింది.
అలాంటి సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (84 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. సీనియర్ ప్లేయర్లు ఏ బౌలర్లను ఆడలేకపోయారో వారి బౌలింగ్‌లోనే భారీ షాట్లు ఆడి ముంబై స్కోర్ ను పరుగులు పెట్టించాడు. కీలక భాగాస్వామ్యాలు నెలకొల్పుతూ చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. మిగతా బ్యాటర్లు అందరినీ ఇబ్బంది పెట్టిన ఆర్సీబీ బౌలర్లు… తిలక్ వర్మ ధాటికి బంతులు ఎలా వేయలో తెలియక గతి తప్పారు. అతనికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక ఆర్సీబీ బౌలర్ సిరాజ్ ఏకంగా ఐదు వైడ్లు వేశాడంటే తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే 84 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ముంబైకి 171/7 స్కోరు అందించాడు. ఇది చూసిన అభిమానులు అతని ఆటకు సలాం కొట్టారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తిలక్ వర్మను మెచ్చుకున్నాడు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తిలక్ సూపర్ అంటూ ప్రశంసించారు. గతేడాది నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్నాడని ఈ 20 ఏళ్ల కుర్రాడికి కితాబిచ్చాడు. గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన తిలక్.. ముంబై తరఫున కీరోల్ పోషించాడు. మొత్తం 14 మ్యాచుల్లో 131 స్ట్రైక్ రేటుతో 397 పరుగులు చేశాడు. ఈ సీజన్ లోనూ తిలక్ వర్మ ఆ టీం బ్యాటింగ్ భారం మొత్తం భుజాలపై వేసుకున్నాడు. తెలుగు వాడు అయినందుకు గర్వపడుతున్నాం అంటూ ముంబై ఇండియన్స్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ చందానగర్‌కి చెందిన ఈ కుర్రాడు లింగంపల్లి క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు.