దుబారా ఖర్చులకు పెట్టింది పేరు తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టని సాగునీటి నిపుణులు చెబుతున్నా, వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా లక్ష కోట్లకు పైగా కాళేశ్వరంకు తగలేసింది. భారీగా ప్రజా ధనాన్ని వెచ్చించి రెండు టీఎంసీలతో కాళేశ్వరం ఫస్ట్ ఫేజ్ ను నిర్మించగా.. ఇప్పుడు మరో టీఎంసీకి అనుమతి ఇవ్వడంటూ కేంద్రాన్నికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు పంపింది.
36 లక్షల ఎకరాలకు సాగునీరని (18 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్థిరీకరణ) కట్టినా.. ఈ ప్రాజెక్టు నుండి మూడు లక్షల ఎకరాలకు కూడా సాగునీరు పారే అవకాశం లేదు. ఒక్క ఏకరాకు, ఒక పంటకు ఏటా అయ్యే ఖర్చు కనీసం లక్షన్నర రూపాయల నుండి రెండున్నర లక్షల రూపాయలు. ఒక్క ఎకరా పారకున్నా, ఏటా 13,500 కోట్ల రూపాయలు అసలు, వడ్డీ రూపంలో బ్యాంకులకు కట్టాలి. ఈ ఖర్చులన్నీ ప్రజలనుండి ఏదో రూపంలో పిండాల్సిందే. అదనంగా రిపేర్లకు, ఉద్యోగుల ఖర్చులకు ఏటా వందల కోట్ల రూపాయలు వృధా. ఈ చెల్లింపులన్నీ వచ్చే సంవత్సరం నుండే అంటే 2023 నుండే మొదలవుతాయి.
పైగా ఇది చాలదన్నట్టు ఇప్పుడు అదనంగా మరో ఒక టీఎంసీకి అనుమతినివ్వాలని కేంద్రానికి దరఖాస్తు పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి అయ్యే అదనపు ఖర్చు కనీసం 40,000 కోట్ల రూపాయలు. అసలు విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్టు వల్ల అదనంగా ఒక్క ఎకరా కూడా పారదని రాష్ట్ర ప్రభుత్వమే డీపీఆర్ లో పేర్కొంది. మరి ఈ ప్రాజెక్టు ఎందుకు కడుతున్నారని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే, గొదావరిలొ వరద వచ్చే రోజులు తక్కువ అయ్యాయట… అందుకని ముందు అనుకున్న నీళ్ళనే తక్కువ రోజులలో ఎత్తిపోయాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టు కడుతున్నారని చెప్పడం గమనార్హం… అంటే అదనంగా ఒక్క ఎకరా పారదు, కానీ 40,000 కోట్ల రూపాయల అదనపు ఖర్చు…
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఉపయోగం లేని మరో మరో టీఎంసి కోసం కేంద్రాన్ని అనుమతి కోరడంతో మరో విడత కమిషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరుతున్నట్లుందంటూ విమర్శలు వస్తున్నాయి.