సెల్ ఫోన్, ఇంటర్ నెట్, ఒటిటి ఫేస్బుక్ లాంటి డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్య మరుగున పడిపోతోంది అన్నది వాస్తవం. కానీ సత్తా ఉన్న పుస్తకాలూ రాస్తే హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి అని ఈమధ్య ప్రముఖ సాహితివేత్తా, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ రాసిన ‘పోయిట్రీ వర్క్ షాప్’ పుస్తకం రుజువు చేసింది. అమ్మకాలల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఈమధ్య కాలంలో మోహన రావు దురికి రాసిన ‘నీతి మాలినవాళ్ళ నీతి కథలు’ కథల సంకలనం కూడా అమ్మకాలల్లో ఇలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందుకే ‘నీతి మాలినవాళ్ళ నీతి కథలు’ రెండో భాగం కూడా విడుదల చేసింది సాహితీ ప్రచురణ (విజయవాడ) సంస్థ. ఇప్పుడు మూడో భాగం, నాలుగో భాగం కూడా మేలో రాబోతున్నాయి. ‘నవధాన్యాలు’ అనే మరో పుస్తకం కూడా విపరీతంగా అమ్ముడు పోతున్నాయి.
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పోయిట్రీ వర్క్ షాప్’ పుస్తకం తెలుగు సాహిత్యంలో వినూత్న ప్రయోగం. 1862 నుంచి 1962 వరకు, అంటే వంద ఏళ్లలో తెలుగు సాహిత్యంలోని దాదాపు 182 ప్రముఖ కవుల పాపులర్ కవితలను అయన ఏరి కూర్చారు. అంటే గురజాడ నుంచి ఆదునిక కాలానికి చెందిన కవుల సుప్రసిద్ధ కవితల కవితలు ఉన్నాయి. అయితే అవి కేవలం ప్రిటింగ్ రూపంలో లేవు. వాళ్ళ సొంత చేతి రాతలో రాసిన కవితలు చూడవచ్చు. గురజాడ దస్తూరి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఆయన సంతకం ఎలా ఉంటుందో? అతను రాసే విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? కానీ ఈ పుస్తకంలో అవి అన్నీ ఉన్నాయి.
అంతే కాదు. ఓ కవి మొదటి వెర్షన్ కి, అది మార్పులు – చేర్పులు చేసుకుని చివరికి ప్రింటింగ్ కు వచ్చేసరికి ఎన్నో మార్పులకు గురవుతుంది. ఆ కవి రాసిన మొదటి వెర్షన్కీ – ఫైనల్ గా ప్రింటింగ్ కి వచ్చేసరికి ఎలా మారిందో ఇందులో చూడవచ్చు. ఈ నరకం గురజాడ, సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ కి కూడా తప్పలేదు. ఇది చూస్తే కొత్త కవులకు తమ తప్పులు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి సాహితి ప్రియుడు ‘పోయిట్రీ వర్క్ షాప్’ పుస్తకం కొని, ఒక ప్రాపర్టీ లాగా దాచుకునే గొప్ప పుస్తకం. అందుకే అమ్మకాలల్లో దుమ్ము రేపుతోంది.