ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రాణాపాయంలో శత్రువు ఉన్నా.. ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది, ఓ పసి బిడ్డ ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతుంటే.. ఎంత బండ రాతి హృదయమైనా కరిగిపోతుంది. ఆ బిడ్డను కాపాడేందుకు చేతనైన సాయం చేయాలని అనిపిస్తుంది. కానీ నిత్యం కేసులు, గొడవలు, అల్లర్ల మధ్య డ్యూటీ చేసే ఆ పోలీసుల హృదయాలు.. బండరాయి కన్నా మోటుగా తయారయ్యాయేమో ! తమ బాబు అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కి వస్తోన్న కారుని చెకింగ్ పేరుతో ఖాకీలు ఆపారు. రూ. 1,100 చలానా ఉందని చెప్పి, కట్టిన తర్వాతే వెళ్లాలని హుకం జారీ చేశారు. ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో బిడ్డ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. చలానా అయితే చెల్లించారు… మరి పోలీసులు ఆ చిన్నారి ప్రాణాలను తెచ్చివ్వగలరా ?? ఇదేనా ప్రభుత్వం చెప్పే ఫ్రెండ్లీ పోలీసింగ్ ??
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. జనగామా జిల్లా జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశ్, సరస్వతి దంపతులకు 3 నెలల కిందట కుమారుడు జన్మించాడు. బాలుడు రేవంత్ కొన్ని రోజులుగా పాలు తాగడం లేదు. తల్లిదండ్రులు జనగామ శ్రీ సుధా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన అక్కడి వైద్యులు, వెంటనే హైదరాబాద్ లోని నిలోఫర్ తీసుకువెళ్లాలని సూచించారు. అందుబాటులో ఉన్న కారుని కిరాయికి మాట్లాడుకుని తల్లిదండ్రులు హైదరాబాద్ బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారుని చెకింగ్ పేరుతో ఆపారు. నంబర్ పై ఆన్ లైన్ లో చూడగా, రూ.1,100 చలానా ఉందని చూపించింది. దీంతో ఆ చలానా కట్టి వెళ్లాలని చెప్పారు. వాటిని చెల్లిస్తేనే విడిచిపెడతామని స్పష్టం చేశారు. బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. చేసేదిలేక కారు డ్రైవర్ సాయి.. వంగపల్లి సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి చలానా కట్టి వచ్చాడు. ఇందుకోసం 30 నిమిషాలుపైగా పట్టింది. అనంతరం హైదరాబాద్ వెళ్లాక.. రేవంత్‌ను పరీక్షించిన వైద్యులు ఆలస్యంగా రావడంతో మృతి చెందాడని చెప్పారు.
పోలీసులు దయతలిచి వదిలి ఉంటే.. 30 నిమిషాల ముందే ఆసుపత్రికి వచ్చే వారమని, తమ బిడ్డ బతికే అవకాశం ఉండేదని తల్లిదండ్రులు మల్లేశ్, సరస్వతి రోదిస్తూ చెప్పారు. బిడ్డ ఆపదలో ఉన్నాడని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, చలానా కడితే పంపిస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడారని వాపోయారు. ఎంతటి పాశాన హృదయులైనా.. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే… కాస్త కనికరం చూపిస్తారు. ఇంకా అవసరమైతే సాయం చేసేందుకు ముందుకొస్తారు. కానీ ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు వెయ్యి రూపాయల చలానా కోసం ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం పదే పదే చెబుతోన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ? పేదలపైనే నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తారా ? బడా బాబులు ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా చూసీ చూడనట్లు వదిలేసే ఖాకీలు.. నిరుపేదలపై తమ ప్రతాపాన్ని చూపడం ఎంతవరకు సమంజసం. బాధ్యులైన అధికారులను గుర్తించి, ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే, ఇతర అధికారులకి ప్రజలతో మంచిగా మెలగాలనే సందేశం పంపినట్లు అవుతుంది. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా లేక ఈ ఘటనకు మసిపూసి మూలనపడేస్తుందా చూడాలి !!