పట్టాభిని వైసీపీ టార్గెట్ చేయడం వెనక వ్యూహమేంటి.? సొంత పార్టీలో ప్రత్యర్ధులతోపాటు పట్టాభి తోడైతే గన్నవరంలో తన రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆందోళన చెందారా..? గన్నవరంపై పట్టాభి చూపును సైడ్ చేసి… అతడిలో భయాన్ని ప్రోది చేసేందుకే ఆయనపై దాడి జరిగిందా..?
గన్నవరం ఎమ్మెల్యే వంశీ. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి అధికార వైసీపీలో చేరారు. వంశీ వైసీపీలో చేరడంతో అక్కడ టీడీపీకి బచ్చుల అర్జునుడు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్యానికి గురి కావడంతో.. వంశీకి ధీటైన నాయకుడిని టీడీపీ అధిష్టానం అన్వేషించసాగింది. ఈక్రమంలోనే టీడీపీ హైకమాండ్ పట్టాభి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్ధి పార్టీలో బలమైన వాయిస్ ను రైజ్ చేసే నేతలే లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో టీడీపీలో బలమైన నేతలు సైతం పార్టీలు మారారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులున్న నేపథ్యంలో పట్టాభి టీడీపీ తరుఫున తన వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. గత ఏడాది కూడా ఆయనపై దాడులు జరిగినా వాటికి ఏమాత్రం భయపడకుండా వైసీపీపై తన గళాన్ని వినిపిస్తూనే వస్తున్నారు.
పార్టీలో సామాన్య నాయకుడిగానున్న పట్టాభి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరుకున్నాడు. అటు పార్టీలోనూ, ఇటు జనాల్లోనూ పట్టాభికి ఫేమ్ లభించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పట్టాభిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని టీడీపీ హైకమాండ్ భావిస్తుందన్న చర్చ జరుగుతోంది.
ఈ విషయం వల్లభనేని వంశీ చెవిన పడింది. అసలే వైసీపీలో వర్గపోరుతో సతమతం అవుతుంటే..బలమైన నేతగా ప్రొజెక్ట్ అవుతున్న పట్టాభిని ఆదిలోనే భయపెట్టాలని వంశీ భావించారని అంటున్నారు. అందులో భాగంగానే 20 గంటల పాటు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎంతలా భయపెట్టాలో అంతలా చేశారు. ఇలా చేయడం వలన పట్టాభిని మరింత హైలెట్ చేసినట్లు అవుతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.