నిజమైన ప్రజా పాలకులకు ఎలాంటి బేషజాలు ఉండవు. ఏడాది కాలంగా ఈ విషయం తెలంగాణ ప్రజలు పలు సందర్భాల్లో అర్ధమైంది. ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ కు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వారి మనసు నొచ్చుకుంటుంది. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే మొండిపట్టుదల వారిలో కనిపించదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించిన తీరు..ఏడాది కాలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానానికి వెయ్యి రెట్లు తేడా ఉన్నది. ప్రజల మనసెరిగి పాలించేవాడే నిజమైన నాయకుడు అని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి నమ్ముతారు. అందుకే ఎక్కడా బేషజాలకు వెళ్లకుండా పాలన సాఫీగా సాగుతోంది. తాజాగా అదానీ సంస్థల నుంచి సీఎస్ఆర్ ఫ్రండ్స్ కింద ప్రకటించిన రూ. 100 కోట్లను సున్నితంగా తిరస్కరించడం అదే కోవలోకి వస్తుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పాలకుడి దార్శనికతకు అడ్డం పడుతున్నాయి. తప్పు, ఒప్పుల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం పేరు వివాదాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని ఆయన చేసిన ప్రకటన హుందాతనాన్ని చాటుతోంది.
నిజానికి కార్పొరేట్ సోషల్ రెస్పాస్సబులిటీ కింద చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు విరాళాలు ఇస్తాయి. అదేమీ కొత్త కాదు. వాటిని ఎంత మంచిగా ఉపయోగిస్తారన్నది పాలకుడి దార్శనికత. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటికీ అదానీ గ్రూపు కూడా సీఎస్ఆర్ ఫండ్స్ కింద రూ. 100 కోట్లు ఇచ్చింది. వాటికి ఇంకా బదలాయించలేదు. ఈ లోపే అదానీ కంపెనీ వ్యవహారాలపై వివాదం నెలకొనడం అందరికీ తెలిసింది. సందట్లో సడేమియా అన్నట్లు ప్రతిపక్షాలు ఈ అంశంలో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టాయి. కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి కోడిగుడ్డుపై ఈకలు పీకడం కూడా మొదలు పెట్టారు. సీఎస్ఆర్ ఫండ్స్ విషయంలో నిజానికి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన అవసరం కూడా లేదు. అదేమీ సీఎం జేబులోకో…మంత్రుల ఖాతాల్లోకో వెళ్లవు. తెలంగాణ నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంచేందుకు వాడతారు. కానీ అధికారం పోయిందన్న ఫ్రస్టేషన్ లో…తమ ఉద్యోగాలు పోయాయన్న నైరాశ్యంలో నిరుద్యోగులపై కక్షగట్టారు గులాబీ నేతలు. పైగా ఇందులోకి సీఎం రేవంత్ రెడ్డిని కూడా లాగారు. నిజానిజాలు తెలుసుకోకుండా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేశాయి కొన్ని మీడియా సంస్థలు. వాటి వెనుక ఎవరి హ్యాండ్ ఉందనేది అందిరికీ తెలుసు. అయితే తెలంగాణ బ్రాండ్ కు బ్యాడ్ నేమ్ రావడం ఏ మాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇస్తూ అవసరమైతే నిర్ణయాలను పునః సమీక్ష చేస్తున్నారు. గత పదేళ్లలో నియంతృత్వ పోకడలతో పాలన చేసిన బీఆర్ఎస్ దీన్ని వెనక్కు తగ్గినట్లు, ఓడిపోయినట్లు ప్రచారం చేసుకొని శాడిజం ప్రదర్శిస్తోంది. కానీ తెలంగాణ ఎప్పుడూ వివాదాల్లో ఉండొద్దనే దార్శనికతతో తీసుకున్న నిర్ణయం ఇదని వారికి అర్దం కావడం లేదు. ఒకవేళ అర్ధం అయినా కూడా ఒప్పుకునే హృదయం వారికి ఉండదు.