ఓ వైపు రాష్ట్రాన్ని టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తుండగా తాజాగా టెన్త్ పేపర్ లీక్ ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపుతోంది. పది పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే క్వశ్చన్ పేపర్ లీక్ కావడం సంచలనంగా మారింది. పేపర్ లీక్ పై మొదట విద్యాశాఖ అధికారులు బుకాయించినా వాట్సప్ లో పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు బయటకు రావడంతో నలుగురిని సస్పెండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని అధికారులు చెప్పిన మరుసటి రోజే హిందీ పేపర్ కూడా లీక్ అయినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి.
వికారాబాద్ జిల్లా తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్ కాగా.. తాజాగా వరంగల్, కరీంనగర్ లో హిందీ పేపర్ లీక్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు పేపర్ లీక్ అయిన తరహాలోనే హిందీ పేపర్ కూడా లీక్ అయినట్లు వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఉదయం 9 :30నిమిషాలకు పరీక్ష ప్రారంభం కాగా ఆ మరికొద్ది క్షణాల్లోనే హిందీ పేపర్ వాట్సప్ లో చక్కర్లు కొట్టినట్లు స్థానికంగా వార్త వైరల్ అవుతోంది. మరో పేపర్ కూడా లీక్ అయినట్లు వార్తలు వస్తుండటంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడం సర్కార్ కు చేతకాదు. టెన్త్ పరీక్షలను కూడా సమర్ధవంతంగా నిర్వహించడం చేతకాదా..? అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే.. వరుసగా రెండు ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తారా..? అనే అనుమానాలు కల్గుతున్నాయి. మరోవైపు క్వశ్చన్ పేపర్ల లీక్ పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.