తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో పార్టీ నేతలతో చర్చిస్తుండగా… బయట ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే విమర్శలు చేస్తావా..? అంటూ పీసీసీ కార్యదర్శి అనిల్ ను ఓయూ జేఏసీ కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టారు. ఆయన ఎదుటే సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్లను విమర్శించిన అనిల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో లో ఒకరినొకరు తోసుకున్నారు. గల్లాలు పట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మల్లురవి వచ్చి శాంతింపజేశారు.
అనిల్ ను అడ్డుకున్న ఓయూ విద్యార్ధి నేతలను ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. వీరంతా రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అయితే, ఇటీవల ప్రకటించిన పీసీసీ నూతన కమిటీలో ఓయూ విద్యార్ధి కాంగ్రెస్ నేతల్లో కొంతమందికి మరోసారి పదవులు దక్కలేదు. దీంతో వారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గారు. ఇన్నాళ్ళు ఆయన నాయకత్వంలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని.. రేవంత్ వచ్చాకే ఊపు వచ్చిందని బహిరంగంగా చెప్పుకున్న నేతలే ఇప్పుడు ఉత్తమ్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోకుండా ఆయన చెంతకు చేరారు. వీరిని అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డిని ఉత్తమ్ టార్గెట్ చేస్తున్నారు. ఎలాగైనా , రేవంత్ ను పీసీసీ నుంచి ఊడపీకాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే గాంధీ భవన్ ఘర్షణగా తెలుస్తోంది.
ముందస్తు వ్యూహంలో భాగంగానే గాంధీ భవన్ లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. పదవులు కోల్పోయిన ఓయూ జేఏసీ నేతలు సీనియర్ నేతల అండతోనే చెలరేగిపోయి ఉండొచ్చు. అయితే, గాంధీ భవన్ లో వాగ్వాదానికి దిగిన ఓయూ జేఏసి నేతల తీరును మరికొంతమంది ఓయూ జేఏసి నేతలే తప్పుబడుతుండటం గమనార్హం.